మద్యం తాగారా? మేం ఫ్రీగా ఇంటి వద్ద డ్రాప్ చేస్తాం
న్యూ ఇయర్ వేళ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఆఫర్
న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకున్నారా? ఆ పార్టీలో మద్యం తాగారా? అనవసరంగా వాహనాలు డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడొద్దు. తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ఇలాంటి వారికోసం బంపర్ ఆఫర్ ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం అర్ధరాత్రి మద్యం తాగిన వాళ్లను సేఫ్‌గా వాళ్ల ఇంటి వద్ద డ్రాప్ చేయనుంది. మద్యం తాగిన వాళ్లు తామిస్తున్న ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్, గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 500 కార్లు, 150 బైక్ ట్యాక్సీలను మందుబాబుల సేఫ్ జర్నీ కోసం సిద్ధంగా ఉంచింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఇక చాయిస్ మీదే.. పార్టీ చేసుకోండి.. ఎంజాయ్ చేయండి.. సేఫ్ గా ఇంటికి చేరండి.. హ్యాపీ న్యూ ఇయర్ అని ఫోర్ వీలర్స్, గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆహ్వానిస్తోంది.