మహా కుంభమేళాలో వీఐపీలకు స్పెషల్‌ సర్క్యూట్‌

ప్రత్యేకంగా టెంట్‌ సిటీ ఏర్పాటు చేసిన యూపీ సర్కారు

Advertisement
Update:2024-12-26 20:33 IST

వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబోయే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాలో పాల్గొనడానికి, పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించడానికి దేశవిదేశాల నుంచి వచ్చే వీఐపీ భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకంగా ఒక టెంట్‌ సిటీనే అభివృద్ధి చేసింది. సంక్రాంతి పర్వదినానికి ఒక రోజు ముందు పుష్య పౌర్ణమి అంటే జనవరి 13న ప్రారంభమయ్యే మహా కుంభమేళ 45 రోజుల పాటు కొనసాగి మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌ రాజ్‌ ఫెయిర్‌ అథారిటీ వీఐపీల కోసం బస, ఇతర ప్రొటోకాల్‌ సేవలకు చర్యలు ముమ్మరం చేసింది. రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ముఖ్యులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, విదేశీ అతిథులకు ప్రొటోకాల్ సేవలందించడానికి ముగ్గురు అడిషనల్‌ మెజిస్ట్రేట్లు, ముగ్గురు డిప్యూటీ జిల్లా మెజిస్ట్రేట్లు, ముగ్గురు నాయబ్‌ తహశీల్దార్లు సహా పలువురు ఉద్యోగులను నియమించారు. 250 టెంట్లతో కూడిన సర్క్యూట్‌ హౌస్‌ లో వీఐపీలకు బస ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రయాగ్‌ రాజ్‌లోని 21 గెస్ట్‌ హౌసుల్లో గల 314 సూట్లు, రూములను వీఐపీలకు కేటాయిస్తారు. ఇతర ప్రముఖుల కోసం 110 కాటేజీలను ఏర్పాటు చేశారు. అలాగే 2,200 కాటేజీలతో మరో టెంట్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ ఫెయిర్‌ అథారిటీ వెబ్‌సైట్‌, పోర్టల్‌ ద్వారా ఇక్కడ టెంట్లను బుక్‌ చేసుకోవచ్చు. కుంభమేళాకు వచ్చే సాధారణ భక్తులతో పాటు అందరికీ 24 గంటల పాటు వైద్యం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.




 


Tags:    
Advertisement

Similar News