ఈ ప్రపంచ వింతలు ఇకపై కనిపించవట!
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూమిపై విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. క్లైమెట్ ఛేంజ్ కారణంగా భూమి వేడెక్కుతోంది. దీంతో భూమిపై చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఈ భూమిపై వింతలు విశేషాలకు కొదువ లేదు. ముఖ్యంగా భౌగోళికంగా రూపుదిద్దుకున్న సహజ వింతలు ఈ భూమిపై చాలానే ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని సహజ వింతలు అంతరించే దశలో ఉన్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అవేంటంటే..
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూమిపై విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. క్లైమెట్ ఛేంజ్ కారణంగా భూమి వేడెక్కుతోంది. దీంతో భూమిపై చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతో కొన్ని చెట్ల జాతులు, జంతువులు, పక్షులతో పాటు కొన్ని సహజ వింతలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. వాటిలో ముఖ్యమైనవి ఇవీ..
గ్రేట్ బారియర్ రీఫ్
ఆస్ట్రేలియా ఈశాన్య తీరంలో ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్‌గా పేరుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా ఈ అతి పెద్ద పగడపు దిబ్బలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ పగడపు దిబ్బల్లో 400 పైగా కోరల్స్ రకాలు, 1500కు పైగా చేప జాతులు ఉంటాయి.
జెయింట్ సీక్వోయా
కాలిఫోర్నియాలోని అడవుల్లో పెరిగే జెయింట్ సీక్వోయా అనే వృక్ష జాతి అంతరించే దశకు చేరుకుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇవి ప్రపంచంలోనే ఎత్తైన వృక్ష జాతుల్లో ఒకటి. వీటిని జెయింట్ రెడ్ వుడ్ చెట్లు అని కూడా అంటారు. ఇవి భారీ సైజులో 300 అడుగుల ఎత్తు పెరుగుతాయి. సుమారు 600 టన్నుల బరువు తూగుతాయి. సుమారు 3,000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెట్లు కొంతకాలం తర్వాత కనిపించవని సైంటిస్టులు చెప్తున్నారు.
గ్లేసియర్ నేషనల్ పార్క్
అమెరికాలో ఉన్న అత్యంత అందమైన నేషనల్ పార్క్ ఇది. ఇక్కడ సుమారు150 పర్వత సరస్సులు ఉంటాయి. అయితే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇక్కడ పర్వతాల్లోని ఐస్ కరుగుతోంది. దీంతో గ్లేసియర్స్ కాస్తా రాళ్ల కొండల్లా మారిపోతున్నాయి. ఎంతో అందమైన ఈ ప్రాంతం తన వైభవాన్ని కోల్పోతోందని సైంటిస్టులు వాపోతున్నారు.
విక్టోరియా వాటర్ ఫాల్స్
పశ్చిమ జింబాబ్వే ప్రాంతంలో ఉన్న విక్టోరియా వాటర్ ఫాల్స్ ప్రపంచంలోనే అతి పొడవైన జలపాతం. ఇది సుమారు 1700 మీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణం ఈ జలపాతం ఎండిపోతోంది. ఇక్కడ నీటి శాతం తగ్గిపోతోంది. కొన్నేళ్లకు ఈ ప్రాంతంలో నీటి జాడ కనిపించకపోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు.
సుందర్బన్ అడవులు
ఇండియా బంగ్లాదేశ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సుందర్బన్స్ అడవులకు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులుగా పేరుంది. ఇవి చాలా అరుదైన అడవులు. అయితే పెరుగుతున్న సముద్ర నీటిమట్టం కారణంగా ఈ ప్రాంతంలో అడవులు, జంతువులు కనుమరుగయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.