నరసింహస్వామి ఆలయాలు సాధారణంగాకొండలలో, కోనలలో ఉంటాయి.
ఈ స్వామి రూపాలు అనేక ఆలయాలలో అనేక విధాలుగా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషంతోనరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు.
చిత్తూరు జిల్లాలో సింగిరికోనలొ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అడవి ప్రాంతమైన చిన్నకొండమీద ఉంటుంది. కింద ఎడమ పక్క చిన్న జలపాతంఉంటుంది. ఆ నీళ్ళన్నీ కింద కోనేరులో పడుతుంటాయి. ఈ జలపాతంనుంచే పైపుల ద్వారా పై ఆలయానికి,మిగతా అవసరాలకు నీటి సరఫరా చేస్తారు.
అతి పురాతనమైన ఆలయం. ఛైర్మన్ గుణవంతరావు, వారి పుత్రులు భాస్కర్ బాబు, గిరిబాబు ఆలయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి కులదైవం లక్ష్మీనరసింహస్వామి కావడంతో ఆలనా పాలనా లేని ఈ ఆలయానికి 25 సంవత్సరాల పైనుంచి వారే సేవకులయ్యారు.
ఈ స్వామి స్వయంభూ అని చెబుతారు. ఆరు అడుగు ఎత్తులో నల్లరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామి, ఇరుపక్కల శ్రీదేవి, భూదేవి కొలువుదీరి ఉంటారు.
ఇక్కడ శ్రీనరసింహస్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లు ఉంటుంది. దానికి ఓ కథనం ఉంది.
స్వామి వేటకు వచ్చి కొంచెం సేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందిట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని అలాగే శిలలా ఉండిపోయారట.
రోజూ ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం, గోపూజ మొదలైన నిత్య సేవలన్నీ చేస్తారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు విశేష తిరుమంజనం, సుదర్శన నారసింహ మహా యాగం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు.
ఇక్కడ పూజలు ఉదయం మంత్ర సహిత కార్యక్రమాలతో ప్రారంభం అవుతాయి. తర్వాత అర్చనలు, స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాడతారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో, ఎన్నో ప్రయాసలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందులు తొలగించి, సంతోషంగా ఉండేలా చెయ్యవయ్యా. ఎన్నో అవతారాలెత్తి ఎంత మందినో కాపాడినవాడివి నువ్వు అంటూ. పాట ద్వారా అర్చక స్వామి వేడుకుంటారు.
ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో గడపాలన్నా, సుందరమైన విహార యాత్రకు వెళ్ళాలన్నా ఇది చక్కని ప్రదేశం. ఇలాంటి ఆలయాలను అభివృద్ధి పరచటం మన కర్తవ్యం. అవకాశం వున్నవాళ్ళు తప్పకుండా చూడవలసిన ప్రదేశం.
(మార్గం: తిరుపతినుంచి పుత్తూరు, నారాయణవనం మీదుగా నాగిలేరు వెళ్ళే బస్ లో నాగిలేరు దాకా వెళ్ళాలి. అక్కడినుండి ఆటోలలో వెళ్ళి రావచ్చు.)
-శ్రీమతి పి.ఎస్.ఎమ్.లక్ష్మి