సీషెల్స్...న్యూ ఇయర్ టూర్
Seychelles Tourism: సీషెల్స్... పేరులోనే సముద్రాన్ని ఇముడ్చుకున్న దేశమిది. కానీ ఈ దేశం సముద్ర తీరాన లేదు, సముద్రం మధ్యలో ఉంది. హిందూ మహా సముద్రం మధ్యలో పైకి లేచిన దీవుల సమూహం. మనదేశం నుంచి విమానంలో నాలుగు గంటల ప్రయాణంలో అక్కడికి చేరుకోవచ్చు.
చందమామ కథలో చదివిన పగడపు దీవులు చూడాలని ఉందా?
కశ్మీర్ ఆభరణాల్లో చూసే టర్కోయిస్ బ్లూ తీరాన విహరించాలని ఉందా!
అయితే ఈ న్యూఇయర్ వేడుకలకు సీషెల్స్‌కి ప్రయాణమవ్వండి.
సీషెల్స్... పేరులోనే సముద్రాన్ని ఇముడ్చుకున్న దేశమిది. కానీ ఈ దేశం సముద్ర తీరాన లేదు, సముద్రం మధ్యలో ఉంది. హిందూ మహా సముద్రం మధ్యలో పైకి లేచిన దీవుల సమూహం. మనదేశం నుంచి విమానంలో నాలుగు గంటల ప్రయాణంలో అక్కడికి చేరుకోవచ్చు. ఎప్పుడూ సింగపూర్, మాల్దీవులకేనా? ఈ సారి ఇలా ఓ టూర్ వేస్తే ఎలా ఉంటుందో చూడండి.
సీషెల్స్‌లో వందకు పైగా పగడపు దీవులున్నాయి. కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరం ఉంది. ఈ నీటిలో పడవలో ప్రయాణిస్తుంటే మన పడవ నీడ నీటి మీద తేలుతుంటే నీడ కూడా మనతోపాటే ప్రయాణిస్తుంది. నీటి అడుగున నేల స్పష్టంగా కనిపిస్తుంది.
అడవుల్లో విహారం మనసును మరో లోకంలోకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో మనుషుల సంచారం చాలా తక్కువ. దాంతో అడవి తన సహజసిద్ధమైన స్వచ్ఛతను కోల్పోలేదు. అలాగే మరో విషయం ఈ ఐలాండ్స్‌లో ఒక దీవి పేరు బర్డ్ ఐలాండ్. ఇక్కడకు ఏటా అక్టోబర్‌లో పదిహేను లక్షల మైనా పక్షులు వస్తాయి.
సీషెల్స్‌లో ఉన్న బీచ్ రిసార్టుల్లో నాలుగు రోజులు బస చేసి, రోజూ కొన్ని దీవుల్లో విహరించవచ్చు. వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇది మంచి ప్లేస్. అలాగే ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. నాలుగు రోజులున్నా బోర్ కొట్టదు. ముంబయి నుంచి మాహే దీవికి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. రాజధాని నగరం పేరు విక్టోరియా. ఇది మాహే దీవిలో ఉంది. బ్రిటిష్ రాణి పేరు మీద పెట్టిన పేరది. ఒకప్పుడు ఈ దీవులు బ్రిటిష్ పాలనలో ఉండేవి.