ది గ్రేట్ రణ్ ఉత్సవ్ చూసొద్దామా?

ట్రావెలింగ్‌ను ఇష్టపడేవాళ్లు డిసెంబర్ నెలలో కచ్చితంగా ఓ స్పెషల్ టూర్ ప్లాన్ చేస్తుంటారు.

Advertisement
Update:2023-12-05 15:30 IST

ట్రావెలింగ్‌ను ఇష్టపడేవాళ్లు డిసెంబర్ నెలలో కచ్చితంగా ఓ స్పెషల్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఏడాది మొత్తంలో వేళ్లే ట్రిప్స్ ఒక ఎత్తయితే.. ఇయర్ ఎండింగ్‌లో వెళ్లే చివరి ట్రిప్ మరో ఎత్తు. అందుకే డిసెంబర్ ట్రిప్స్ ప్రత్యేకంగా ఉంటాయి. డిసెంబర్‌‌లో వెళ్లాల్సిన స్పెషల్ టూర్స్‌లో ‘రణ్ ఆఫ్ కచ్’ కూడా ఒకటి. ఎందుకంటే ఈ సీజన్‌లో అక్కడ జరిగే ‘రణ్ ఉత్సవ్’ చాలా పాపులర్. దీని స్పెషాలిటీస్ ఏంటంటే..

గుజరాత్‌లో ఉన్న రణ్ ఆఫ్ కచ్ ఎడారిలో ప్రతిఏటా చలికాలంలో ప్రత్యేకమైన కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. అదే ‘రణ్ ఉత్సవ్’. ట్రావెలింగ్‌ను ఇష్టపడే ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన ఫెస్టివల్ ఇది. తెల్లటి ఇసుక ఎడారిలో జరిగే ‘రణ్ ఉత్సవ్’ మనదేశంలో జరిగే పెద్ద కల్చరల్ ఫెస్టివల్స్‌లో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం చలికాలంలో అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు జరుగుతుంది.

కచ్ అనేది మనదేశంలోనే అతి పెద్ద జిల్లా. ఇది దేశానికి బోర్డర్‌‌లో ఉంటుంది. దీనికి ఒకవైపు పాకిస్థాన్‌, మరోవైపు అరేబియా సముద్రం ఉంటాయి. ఇక్కడ ఉండే తెల్లటి ఎడారికి ‘రణ్ ఆఫ్ కచ్’ అని పేరు. ఈ ప్రాంతం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు ఉప్పు నీటిలో మునిగి ఉంటుంది. శీతకాలం వచ్చేసరికి నీరు ఇంకిపోయి, తెల్లగా పరుచుకున్న ఉప్పు బయటికి తేలుతుంది. ఏడు వేల చదరపు కిలోమీటర్లు ఉండే ఈ ఏడారి ప్రపంచంలోనే పెద్ద ఉప్పుటెడారి. ఏటా చలికాలంలో ఇక్కడ ‘రణ్ ఉత్సవ్’ను ఘనంగా జరుపుతారు. సుమారు మూడు నెలల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

కచ్ ఫెస్టివల్‌లో ఎన్నో అద్భుతాలుంటాయి. ఉప్పు నీటి ఎడారిలో బస చేస్తూ, సూర్యాస్తమయం, వెన్నెల రాత్రులను ఆస్వాదించడం ఒక ఎత్తైతే.. ఇక్కడి ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు మరో ఎత్తు. గుజరాత్‌ హస్తకళలు-ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఆభరణాలు, పెయింటింగ్‌ల ప్రదర్శనలు, జానపద సంగీత, నృత్య కార్యక్రమాలతో ఈ మూడు నెలలు కచ్‌ ఎడారి సంబరాలతో నిండిపోతుంది. వాటితో పాటు ఇక్కడికొచ్చే టూరిస్టులకోసం పారామోటరింగ్‌, ఎడారిలో స్కూటర్ల మీద రైడ్స్‌, రాక్‌ క్లైంబింగ్‌, ఒంటెల మీద సవారీ, పారా సైలింగ్, ర్యాపెలింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి.

కచ్ వెళ్తే అక్కడుండే టెంట్ విలేజుల్లో తప్పకుండా స్టే చేయాలి. తెల్లటి కప్పుతో అందంగా తయారు చేసిన గుడారాలు ఇక్కడ వందల్లో ఉంటాయి. ఫెస్టివల్‌కు వచ్చిన టూరిస్టులంతా ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడ సాంప్రదాయ గుజరాతీ, రాజస్తానీ వంటలు రుచి చూడొచ్చు. సాయంత్రానికి టెంట్ విలేజ్‌లో సంప్రదాయ ఆటపాటలు మొదలవుతాయి. రాత్రిళ్లు తోలుబొమ్మలాటలు, ఇంద్రజాల విద్యలు, కచ్ సంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. గుడారాల్లో నైట్ స్టే చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. పున్నమి రోజు పండువెన్నెల్లో రాత్రిళ్లు అందంగా మెరిసిపోతాయి. వెన్నెల లేని రోజుల్లో ఇక్కడి ఆకాశంలో పాలపుంతలోని దట్టమైన నక్షత్రాలు దర్శనమిస్తాయి. అందుకే ఇక్కడి రాత్రిళ్లు ఎంతో ప్రత్యేకం.

కచ్‌కు వెళ్తే షాపింగ్ చేయడం మర్చిపోకూడదు. ఎందుకంటే కుట్లు, అల్లికలకు కచ్ ఎంతో ఫేమస్. దేశంలోనే బెస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ కచ్ సొంతం. అందుకే కచ్ వెళ్తే అక్కడ దొరికే లోకల్ డిజైన్లు కొనకుండా ఉండలేరు. రణ్ ఉత్సవ్ కోసం గుజరాత్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తుంది. మూడు రాత్రులు, నాలుగు రోజుల ప్యాకేజీ రూ.14,500., రెండు రాత్రులు, మూడు రోజుల ప్యాకేజీ రూ. 10,000, ఒక రాత్రి, రెండు రోజుల ప్యాకేజీ రూ. 5,500 ఉంటుంది. ఈ ప్యాకేజీని రణ్ ఉత్సవ్ వెబ్‌సైట్ (www.rannutsav.com) లో బుక్ చేసుకోవచ్చు.

కచ్‌కు వెళ్లాలంటే ముందుగా భుజ్‌కు చేరుకోవాలి. భుజ్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో రణ్‌ ఆఫ్‌ కచ్‌ ఉంటుంది. భుజ్ నుంచి బస్ లేదా క్యాబ్స్‌లో కచ్ చేరుకోవచ్చు. భుజ్‌ వెళ్లాలంటే అహ్మదాబాద్‌ వెళ్ళి, అక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో చేరుకోవాలి. అహ్మదాబాద్‌కు హైదరాబాద్ నుంచి ట్రైన్, ఫ్లైట్, బస్ సౌకర్యాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News