మినార్
ఢిల్లీ, మెహ్రౌలీలో కుతుబ్‌మినార్ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వెంటనే రెండు సిమెంట్ దిమ్మలు కనిపిస్తాయి. అవి మినార్ నిర్మాణంతో సంబంధం ఉన్నవి కాదు, కొత్తగా కట్టినవి.
ఢిల్లీ, మెహ్రౌలీలో కుతుబ్‌మినార్ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన వెంటనే రెండు సిమెంట్ దిమ్మలు కనిపిస్తాయి. అవి మినార్ నిర్మాణంతో సంబంధం ఉన్నవి కాదు, కొత్తగా కట్టినవి. ఆ దిమ్మల మీద నిలబడితే మినార్ శిఖరాన్ని తాకుతున్నట్లు ఫొటో తీసుకోవచ్చన్నమాట. కెమెరా యాంగిల్‌కు అనుగుణంగా కట్టిన దిమ్మలవి. లోపలికి వెళ్తే అది మరో లోకం. ఎర్రగా అరకొర నిర్మాణాల్లాగ అనిపిస్తాయి. కానీ ప్రతి ఒక్కటీ ఒక చరిత్ర పుస్తకం. చరిత్ర పొరల్లాగానే ఈ నిర్మాణాల గురించిన వాస్తవాలు కూడా పరస్పరం విభేదిస్తున్నట్లు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఏ ఒక్క నిర్మాణమూ ఒకరి కాలంలోది కాదు.
ఒక్కొక్కటి ఒక్కో పాలకుని కాలంలో నిర్మితమవుతూ, మరొకరి కాలంలో విధ్వంసానికి గురవుతూ, ఆ తర్వాత వచ్చిన పాలకుని చేత కొత్త సొబగులు అద్దుకుంటూ రూపుదిద్దుకున్న కట్టడాలవి. గైడ్‌లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొదలు పెట్టి తమకు తోచినట్లు పూర్తి చేస్తారు.
ఏ ఇద్దరూ ఒక నిర్మాణం గురించి ఒకే రకమైన సమాచారాన్ని చెప్పరు. చరిత్ర ఏ మాత్రం తెలియకపోతే ఒక కథలాగ వినడానికి బావుంటాయి వాళ్ల కథనాలు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో శాసనాలు అరబిక్, దేవనాగరి లిపిలో ఉన్నాయి. అవి శాసనాలు అని మాత్రమే చెబుతారు, ఆ శాసనాల్లో ఏముందో ఆ గైడ్‌లు చెప్పరు. మాట తప్పించేస్తారు.
ముగ్గురు కట్టారు
కుతుబ్ మినార్... ఐదంతస్థుల నిర్మాణం. డెబ్బై రెండున్నర మీటర్ల ఎత్తు, నేల మీద చుట్టు కొలత 14.32 డయామీటర్లు. మూడంతస్థులు రెడ్ సాండ్ స్టోన్‌తో కట్టారు. నాలుగు, ఐదు అంతస్థులు పాలరాయి సాండ్‌స్టోన్‌ల కలయిక. ఈ ఐదంతస్తులను 75 ఏళ్లు కట్టారు.
1193లో కుతుబుద్దీన్ ఐబక్ మొదటు పెట్టాడు. ఆ తర్వాత ఇల్టుట్ మిష్ మూడంతస్తులు కట్టాడు. చివరగా ఫిరోజ్ షా తుగ్లక్ ఐదవ అంతస్తు నిర్మించి 1368 నాటికి పూర్తి చేశాడు. తర్వాత సికిందర్ లోదీ, బ్రిటిష్ మేజర్ స్మిత్‌లు పునరుద్ధరణ చేశారు.
ఇప్పుడు ఆర్కియాలజీ విభాగం రీస్టోరేషన్, నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. పాతికేళ్ల కిందట ఉన్న కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో అడుగు పెట్టడం కష్టంగా ఉండేది. ఇప్పుడు టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉంది నిర్మాణం. కుతుబ్ మినార్‌కు ఈశాన్య దిక్కులో ఖవ్వత్ ఉల్ ఇస్లామ్ మసీదు ఉంది.
నలభై ఏళ్ల కందట
నలభై ఏళ్ల కిందటి వరకు పర్యాటకులను కుతుబ్‌మినార్ లోపలికి వెళ్లనిచ్చేవారు. కొన్ని అంతస్థుల వరకు ఎక్కనిచ్చే వారు కూడా. భగ్న ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కారణంగా మినార్ అధిరోహణ నిలిపేశారు.
కుతుబ్‌మినార్‌ని చూడడానికి వెళ్లేటప్పుడు మంచినీళ్లు, తినుబండారాలు వెంట తీసుకుని వెళ్లడం మంచిది. మెహ్రౌలి అభివృద్ధికి నోచుకోని ప్రదేశం అనే చెప్పాలి. అభివృద్ధి లేకపోవడం కంటే పరిశుభ్రత లేకపోవడమే ఆందోళన కలిగించే విషయం. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ బయట ఉండే చిన్న దుకాణాల్లో మంచినీటి బాటిల్ దొరుకుతుంది. కానీ బాటిల్ మూత సీల్ చూస్తే సందేహం వస్తుంది. పర్యాటక ప్రదేశం ఆధారంగా ఉపాధి పెంపొందించుకోవచ్చనే ఆలోచన కూడా కనిపించదు.