పోర్‌బందర్‌ బాపూజీ జన్మభూమి

గుజరాత్‌ రాష్ట్రం, అరేబియా తీరాన పోర్‌బందర్‌ పట్టణం. 'గాంధీ పుట్టిన ప్రదేశమా ఇది...' అని పాడుకోవాలన్నంత ఉత్సాహంగా అడుగుపెడతాం పోర్‌బందర్‌లో. నిజమే అది జాతిపిత పుట్టిన ప్రదేశమే.

Advertisement
Update:2022-12-14 15:21 IST

పోర్‌బందర్‌ బాపూజీ జన్మభూమి

గుజరాత్‌ రాష్ట్రం, అరేబియా తీరాన పోర్‌బందర్‌ పట్టణం. 'గాంధీ పుట్టిన ప్రదేశమా ఇది...' అని పాడుకోవాలన్నంత ఉత్సాహంగా అడుగుపెడతాం పోర్‌బందర్‌లో. నిజమే అది జాతిపిత పుట్టిన ప్రదేశమే. అయితే స్వచ్ఛభారత్‌ అంటూ దేశమంతా చీపుర్లతో చిమ్ముతున్న ప్రభుత్వాలు, స్వచ్‌ భారత్‌ ప్రోగ్రామ్‌కి గాంధీ కళ్లద్దాలనే చిహ్నంగా నిర్ణయించిన ప్రభుత్వాలు, గాంధీ జయంతి రోజునే స్వచ్‌భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వాలు... పోర్‌బందర్‌ వీథులను చిమ్మకుండా ఎందుకు వదిలేశాయో తెలియదు.


పోర్‌బందర్‌ పట్టణం జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఆఫీసులు బ్రిటిష్‌ కాలం నాటి చెక్క తలుపులు, తుప్పు పట్టిన ఇనుప గేట్లతో పురాతన భవనాల్లా ఉన్నాయి. ఆవులు నడి వీథుల్లో తిరుగుతూ వాహనాలకు అడ్డు వస్తుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల గేటు తెరిచి ఉంటే ఏ మాత్రం సంశయించకుండా ఆవరణలోకి వెళ్తున్నాయి కూడా. ఫాదర్‌ ఆఫ్‌ నేషన్‌ పుట్టిన ఊరిని ప్రత్యేకంగా గుర్తించి అభివృద్ధి చేయడం, నిర్వహణకు నిధుల కొరత రాకుండా ఉండడానికి శాశ్వత కార్పస్‌ ఫండ్‌ కేటాయించడం వంటివేవీ ఉండవా అని ఆవేదన కలుగుతుంది. ఆవేదనను అణచుకుని బాపూ మహల్‌ వైపు దారి తీస్తే...


ఇద్దరి ఇళ్లు ఒకదాని వెనుక ఒకటి

పోర్‌బందర్‌లో ఓ విశాలమైన నిర్మాణం గాంధీజీ సొంతిల్లు బాపూ మహల్‌. దాని పక్కనే గాంధీజీ గౌరవార్థం కట్టిన కీర్తిమందిర్‌ ఉంది. గాంధీజీ పుట్టిన బాపూ మహల్‌కి వెనుక వైపే ఉంటుంది కస్తూర్బా గాంధీ ఇల్లు కూడా. ఆ ఇళ్లను బట్టి చూస్తే గాంధీజీ కంటే కస్తూర్భాది సంపన్న కుటుంబం అనిపిస్తుంది. గాంధీజీ ఇంటి ఎక్స్‌టర్నల్‌ ఎలివేషన్‌లో పర్షియన్‌ స్టైల్‌ కనిపిస్తుంది. ఆ ఇంటిలో గాంధీజీ పుట్టిన ప్రదేశంలో స్వస్తిక్‌ గుర్తు ఉంటుంది.


గోడకు గాంధీజి రాట్నం వడుకుతున్న పెయింటింగ్, దానికి పత్తి తోరణం ఉంటాయి. ఇంటి నిర్మాణశైలి ముందు విశాలమైన వరండా, వెనుక గదులతో నిరాడంబరంగా, ఒకింత వైవిధ్యంగా అనిపిస్తుంది. దాదాపుగా మూడవ వంతు గదికి అటక ఉంటుంది.


ఆ అటక మీద లోపలగా పెట్టిన వస్తువులను కిందికి దించాలంటే నిచ్చెన మీద నుంచి అందే అవకాశమే ఉండదు. మనిషి లోపలికి దూరి వెళ్లాల్సిందే. ఏడాది పొడవునా అవసరమయ్యే దినుసులు తెచ్చుకుని అటక మీద దాచుకోవచ్చు. పై అంతస్తుకి వెళ్లడానికి ఇరుకు చెక్కమెట్లు, మెట్ల టర్నింగ్‌లో పట్టుకుని ఎక్కడానికి ఆధారం కోసం లావుపాటి పలుపుతాడు, వర్షాల్లేనప్పుడు వండుకోవడానికి పూర్తి స్థాయి వంట గది ఒకటి, వర్షాల్లో తడవకుండా వండుకోవడానికి మరో చిన్న ఏర్పాటు ఉంది.

ఆ ఇంటి వెనుక దారి నుంచి బయటపడితే కస్తూర్భా ఇంటికి చేరుతాం. రెండు ఇళ్లకు మధ్య వారధి లాంటి నిర్మాణం (తర్వాత పర్యాటకుల కోసం కట్టినది) కూడా ఉంది. కస్తూర్భా ఇంట్లో ప్రతి పడగ్గదికీ ఒక మూల చిన్న గట్టు, వాడిన నీరు బయటకు వెళ్లే ఏర్పాటు కూడా ఉంది ఆ గట్టుకి. కీర్తి మందిర్‌ నిర్మాణం, నిర్వహణ కూడా బాగుంటాయి. ఇది గాంధీజీ సంస్మరణ మందిరం లాంటిది.

పోర్‌బందర్‌ టూర్‌ అంటే గాంధీజీ, కస్తూర్బా గాంధీ ఇళ్లు మాత్రమే కాదు, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News