జంతర్‌మంతర్‌... ప్రపంచ గడియారం

జంతర్‌ మంతర్‌ అంటే... ఏరియల్‌ వ్యూలో కనిపించే అర్థం కాని, అయోమయ నిర్మాణం కాదు. అది ఒక ఖగోళ అద్భుతం.

Advertisement
Update:2022-12-24 19:41 IST

జంతర్‌ మంతర్‌ అంటే... ఏరియల్‌ వ్యూలో కనిపించే అర్థం కాని, అయోమయ నిర్మాణం కాదు. అది ఒక ఖగోళ అద్భుతం. పైగా అలా చూసి ఇలా వచ్చేసే ప్రదేశం కూడా కాదు. అతి పెద్ద సౌరగడియారం, ప్రపంచదేశాల్లో ముఖ్యమైన నగరాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎప్పుడవుతుందో ఇక్కడ ఉండి తెలుసుకోవచ్చు. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండి, ఇంటర్‌నెట్‌లో చూసి ప్రపంచ దేశాల కాలగమనాలను తెలుసుకోవచ్చని తెలియని రోజుల్లో రూపుదిద్దుకున్న కాల నిర్మాణం.

ఢిల్లీ నడిబొడ్డున సంసద్‌ మార్గ్‌లో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంంది జంతర్‌మంతర్‌. ఇందులో సామ్రాట్‌ యంత్ర అతి పెద్ద సౌరగడియారం. జయ ప్రకాశ యంత్ర ఖగోళవ్యవస్థకు ప్రతీక. రామ్‌ యంత్ర అక్షాంశాలు, రేఖాంశాల పట్టికను సూచిస్తుంది. మిశ్రా యంత్రలో ప్రపంచంలో ఏ నగరంలో ఇప్పుడు సమయం ఎంత అనే వివరాల పట్టిక. మనదేశంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయాన్ని తెలియచేయడంతోపాటు న్యూయార్క్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎప్పుడు అవుతుందో, అలాగే ప్రపంచంలోని ప్రముఖ నగరాల సమయాన్ని తెలిపే సూచిక అన్నమాట. ఇంకా మరికొన్ని యంత్రాలున్నాయి. అధ్యయనం చేయడం మొదలు పెడితే ఒక గ్రంథమే రాయదగిన ప్రదేశం.

రాజు తలుచుకుంటే...

జైపూర్‌ రాజు మహారాజా రెండవ జయ్‌సింగ్‌కి ఖగోళశాస్త్రం మీద ఆసక్తి ఎక్కువ. ఆయన నిర్మించిన అబ్జర్వేటరీల్లో ఇదొకటి. దీనిని 1724లో కట్టారు. సూర్యచంద్రుల భ్రమణం, గ్రహగమనాలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల లెక్క కచ్చితంగా చూపించే స్కేల్‌ ఇక్కడ అద్భుతం. ఇప్పుడు ఆ స్కేల్‌ కనిపించడం లేదు. ఇటీవల కొత్తగా రంగులు వేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గోడల మీద ఉండాల్సిన సన్‌డయల్‌ వివరాలు అదృశ్యమయ్యాయి. గతంలో కూడా పునరుద్ధరణ జరిగింది. కానీ ఖగోళ పరిజ్ఞానానికి విఘాతం కలగలేదు.

ఇంత గొప్ప నిర్మాణం గురించి సవివరంగా చెప్పడానికి ఇక్కడ గైడ్‌లు లేకపోవడం పెద్ద లోపమే. డిజిటల్‌ పేమెంట్‌ని ప్రోత్సహించడానికి వీలుగా క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆలోచన చక్కగానే ఉంది. కానీ ఆచరణలోనే అవరోధాలన్నట్లు... డిజిటల్‌ పేమెంట్‌కి సిగ్నల్స్‌ సరిగ్గా అందవు.

వార్తల్లో ఉంటుంది!

జంతర్‌ మంతర్‌ను టీవీలో చూడవచ్చు. వార్తల్లో ఏడాదికి ఐదారు సార్లయినా కనిపిస్తుంది. జంతర్‌మంతర్‌ పార్లమెంట్‌ రోడ్‌(సంసద్‌ మార్గ్‌)లో ఉండడం, విశాలమైన ప్రాంగణం కావడంతో «ధర్నాలు, ఆందోళనలను వ్యక్తం చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో జరుగుతున్న ఆందోళనల వార్త దృశ్యాలను జాగ్రత్తగా గమనిస్తే జంతర్‌మంతర్‌ నిర్మాణంలోని కొన్ని భాగాలు కనిపిస్తాయి.

Tags:    
Advertisement

Similar News