స్టేషన్‌లో స్టే, డేట్ ఛేంజ్.. ఐఆర్‌‌సీటీసీ లేటెస్ట్ ఫీచర్లు!

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్ సెక్షన్‌లో ‘మై బుకింగ్స్’ దగ్గర ‘రిటైరింగ్ రూమ్’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీ పీఎన్‌ఆర్‌ నంబర్‌, స్టేషన్‌ వివరాలు ఎంటర్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-11-07 17:18 IST

స్టేషన్‌లో స్టే, డేట్ ఛేంజ్.. ఐఆర్‌‌సీటీసీ లేటెస్ట్ ఫీచర్లు!

మనదేశంలో రైలు ప్రయాణాలు చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే రైలు రైలు ప్రయాణీకుల సౌకర్యం మేరకు ఐఆర్‌‌సీటీసీ కొన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది.

వృత్తి రీత్యా లేదా ఇతర పనులమీద రోజూ కోట్ల మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే టికెట్ల బుకింగ్ నుంచి టైమింగ్స్ వరకూ ట్రైన్ జర్నీల్లో చాలా సమస్యలుంటాయి. వీటిని తగ్గించేందుకు ఐఆర్‌‌సీటీసీ కొన్ని కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. అవేంటంటే..

రిటైరింగ్‌ రూమ్స్‌

రైలు ప్రయాణాల్లో చాలాసార్లు ట్రైన్ లేట్‌గా వస్తుంటుంది. కొన్నిసార్లు గంటల కొద్దీ రైల్వే స్టేషన్‌లోనే గడపాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వీలుగా ఉండేందుకు ఐఆర్‌సీటీసీ ‘రిటైరింగ్ రూమ్స్’ సేవల్ని తీసుకొచ్చింది. అంటే రైలు కోసం వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో రైల్వే స్టేషన్‌లోనే స్టే చేయొచ్చు. ఇందులో ఏసీ, నాన్‌ ఏసీ, సింగిల్‌, డబుల్‌, డార్మిటరీ తరహా గదులు అందుబాటులో ఉంటాయి. వీటిని గంటల వ్యవధి నుంచి రెండు రోజుల వరకూ బుక్ చేసుకోవచ్చు. అయితే టికెట్‌ రిజర్వేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ రూమ్స్‌ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. వెయిటింగ్ లిస్ట్‌ ప్రయాణికులకు ఇది వర్తించదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. వీటిని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అకౌంట్ సెక్షన్‌లో ‘మై బుకింగ్స్’ దగ్గర ‘రిటైరింగ్ రూమ్’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీ పీఎన్‌ఆర్‌ నంబర్‌, స్టేషన్‌ వివరాలు ఎంటర్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు.

డేట్ చేంజ్

ట్రైన్ టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు ప్లాన్ మారొచ్చు. జర్నీ తేదీ మార్చుకోవాల్సి రావొచ్చు. ఇలాంటప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుని మరో టికెట్ బుక్ చేసుకోవడం ఒక్కటే మార్గం. అయితే ఇకపై అలాంటి సమస్య లేకుండా అదే టికెట్‌పై జర్నీ డేట్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీని తీసుకొచ్చింది ఐఆర్‌‌సీటీసీ. బుక్‌ చేసుకున్న జర్నీ తేదీని మార్చుకోవచ్చు. అయితే దీనికోసం దగ్గర్లోని రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే రిజర్వేషన్‌ డెస్క్‌కు వెళ్లి డేట్ చేంజ్ అప్లికేషన్ సమర్పించాలి. మీరు కోరుకున్న తేదీలో టికెట్లు అందుబాటులో ఉంటే ఆ రోజుకి జర్నీ మారుస్తారు. లేకపోతే లేదు. అలాగే మీరు కోరుకున్న క్లాస్‌లో టికెట్‌ లేకపోతే.. అదనంగా చెల్లించి క్లాస్ అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, డేట్ ఛేంజ్ చేయకుండా కేవలం క్లాస్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు కూడా వీలుంది.

డెస్టినేషన్ అప్‌గ్రేడ్

బుక్‌ చేసుకున్న డెస్టినేషన్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్నప్పుడు డెస్టినేషన్‌ అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది ఐఆర్‌‌సీటీసీ. మీ స్టేషన్‌ రావడానికి ముందే టీటీఈతో మాట్లాడి డెస్టినేషన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీనికిగానూ అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది.

ఫుడ్ డెలివరీ

ఇకపోతే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీకు నచ్చిన ఫుడ్‌ని మీ బెర్త్‌కు డెలివరీ చేసేలా కొత్త ఆప్షన్‌పై పనిచేస్తుంది ఐఆర్‌‌సీటిసీ. దీనికై జొమాటో సంస్థతో ఒప్పందం చేసుకుంది. త్వరలోనే రైల్వే స్టేషన్లన్నింటినీ జొమాటోతో లింక్ చేయనున్నారు. ఐఆర్‌‌సీటీసీ ఇ–క్యాటరింగ్ పోర్టల్‌ ద్వారా మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేస్తే తర్వాతి స్టేషన్‌లో మీ ఫుడ్ డెలివరీ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News