వర్షాకాలంలో ఈ ప్లేసులకు వెళ్లకపోవడమే మంచిది!
వర్షాకాలంలో అన్ని రకాల ప్రదేశాలు పర్యటనలకు అనుకూలించవు. వర్షాలు కురిసే వేళ కొన్ని ప్రదేశాలు మరింత అందంగా తయారైతే మరికొన్ని ప్రదేశాలు ప్రమాదకరంగా మారతాయి.
వర్షాకాలంలో అన్ని రకాల ప్రదేశాలు పర్యటనలకు అనుకూలించవు. వర్షాలు కురిసే వేళ కొన్ని ప్రదేశాలు మరింత అందంగా తయారైతే మరికొన్ని ప్రదేశాలు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ సీజన్‌లో కొన్ని ప్రదేశాలను అవాయిడ్ చేయడం మంచింది. అవేంటంటే..
హిమాలయన్ ఫూట్ హిల్స్‌గా చెప్పబడే కొండ ప్రాంతాలు ఈ సీజన్‌లో ట్రావెలింగ్‌కు అంత అనుకూలంగా ఉండవు. ఉదాహరణకు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో అలాంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
మనాలి, ధర్మశాల
హిమాలయాల నుంచి దిగువకు నదులు ప్రవహించే ముస్సోరీ, నైనిటాల్, రిషికేష్ వంటి కొన్ని ప్రదేశాల్లో ఈ సీజన్‌లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నదులు ప్రవాహం పెరిగినప్పుడు ఈ ప్రాంతాలు వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు వెళ్లేముందు అక్కడి పరిస్థితులు తెలుసుకుని బయలుదేరడం మంచిది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, ధర్మశాల వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా అక్కడ కొండచరియలు విరిగిపడడం, రోడ్డు మూసుకుపోవడం వంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి.
లఢాఖ్
వర్షాకాలం లడఖ్ ప్రాంతం ఎంతో అందంగా ముస్తామవుతుంది. అయితే ఈ సీజన్‌లో లేహ్‌కు ఎలా చేరుకుంటారు అన్నదే సమస్య. నేరుగా ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, మనాలీ మీదుగా రోడ్డు జర్నీ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తపడాలి. వర్షాలు పడేటప్పుడు కొన్నిచోట్ల రోడ్డు బ్లాక్ అవ్వొచ్చు లేదా కొండచరియలు విరిగి పడి రోడ్డు మూసుకుపోవచ్చు. అందుకే, ఈ సీజన్‌లో లేహ్ టూర్ వెళ్లేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గోవా
గోవా టూర్‌కు సీజన్‌తో పని లేదు. కానీ, రుతుపవనాల సమయంలో ఇక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతో గోవాలో అందుబాటులో ఉండే చాలారకాల అడ్వెంచర్ యాక్టివిటీస్, హోటల్స్ బంద్ అవుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో గోవా వెళ్లినా పూర్తి స్థాయిలో టూర్‌ను ఎంజాయ్ చేయడం కుదరని పని.
అండమాన్
దేశ ప్రధాన భూభాగానికి చాలా దూరంలో ఉండే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌కు వర్షాకాలంలో వెళ్లకపోవడమే మంచిది. అండమాన్ దీవుల్లో లేదా బంగాళాఖాతంలో భారీ వర్షపాతం నమోదైనప్పుడు షిప్ సర్వీస్ లేదా ఫ్లైట్ సర్వీసులు ఆగిపోయే అవకాశముంది. కాబట్టి ప్రయాణీకులు వెళ్లినచోటే కొన్ని రోజులు ఇరుక్కుపోయే అవకాశం ఏర్పడొచ్చు.