గురుద్వారా బంగ్లా సాహిబ్...అందరికీ ఆహ్వానం
Gurudwara Bangla Sahib: న్యూ ఢిల్లీలో జంతర్‌మంతర్ నుంచి రెండు కిలోమీటర్లలో ఉంది గురుద్వారా బంగ్లా సాహిబ్. సాయంత్రం సరదాగా నడిచి వెళ్లగలిగితే జయ్ సింగ్ మార్గ్ నుంచి వెళ్తే ఒకటిన్నర కిలోమీటర్ల దూరమే. అశోకా రోడ్, హనుమాన్‌రోడ్‌లు కలిసే మలుపులో ఉంటుంది.
న్యూ ఢిల్లీలో జంతర్‌మంతర్ నుంచి రెండు కిలోమీటర్లలో ఉంది గురుద్వారా బంగ్లా సాహిబ్. సాయంత్రం సరదాగా నడిచి వెళ్లగలిగితే జయ్ సింగ్ మార్గ్ నుంచి వెళ్తే ఒకటిన్నర కిలోమీటర్ల దూరమే. అశోకా రోడ్, హనుమాన్‌రోడ్‌లు కలిసే మలుపులో ఉంటుంది.
ఇక్కడ అద్భుతం ఏమిటంటే... ఇది ఒక మతపరమైన ప్రదేశమే అయినప్పటికీ అన్ని మతాల వాళ్లకూ సాదరస్వాగతం పలుకుతారు. అయితే వారి మత విశ్వాసాలకు విఘాతం కలగనివ్వకుండా గురుద్వారా మొత్తం తిరిగి చూడవచ్చు. గొప్ప నిర్మాణ కౌశలంతో చూడాల్సిన ప్రదేశం.
ప్రాంగణం లోపలికి వెళ్లగానే అక్కడి వాలంటీర్‌లు ఓ వైపు వెళ్లవలసిందిగా చేయి చూపిస్తారు. అక్కడ చెప్పులు, సాక్కులు కూడా వదిలేసి కౌంటర్‌లో పెట్టాలి. ఆ కౌంటర్ వాళ్లు ఆ పక్కనే మరో వైపు చూపిస్తారు. అక్కడికి వెళ్తే తల మీద ధరించడానికి స్కార్ఫ్ ఇస్తారు. ఎలా ధరించాలో చూపిస్తారు. విశాలమైన పాలరాతి నిర్మాణం, బంగారు గోపురం, గురుద్వారా ముందు పెద్ద కొలను ఉంది. అందరూ అందులో పాదాలను శుభ్రం చేసుకోవాలి. అందులో చేపలు ఒక్కొక్కటి కిలో– రెండు కిలోల బరువుంటాయి. పాదాలను తాకుతూ వెళ్తుంటాయి. చేపలు మురికిని తినేస్తూ సరస్సులో పాచి చేరకుండా శుభ్రంగా ఉంచుతాయవి. పెద్ద పెద్ద మాప్‌లు పట్టుకుని మగవాళ్లు సరస్సు మెట్లు, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు.
ఆర్ట్ గ్యాలరీ
గురుద్వారాలో సిక్కు పవిత్ర గ్రంథం ఉంచిన ప్రదేశాన్ని దర్శించుకున్న తర్వాత ఆర్ట్ గ్యాలరీని చూడాలి. ఆ గ్యాలరీ కూడా ఓ చారిత్రక గ్రంథంతో సమానం. సిక్కు మత స్థాపకుడి దగ్గర నుంచి పదవ గురువు గురు గోవింద్ సింగ్ వరకు అందరి ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవి కేవలం వాళ్ల పోర్ట్రయిట్‌లు మాత్రమే కాదు. వారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల చిత్రమాలికలు. ఆ పెయింటింగ్స్ ద్వారా సిక్కులకు– మొఘలులకు మధ్య ఘర్షణ సన్నివేశాలున్నాయి.
జహంగీర్ సమయంలో సిక్కు గురువులకు ఎదురైన కష్టాల బొమ్మలున్నాయి. అలాగే సిక్కు వీరుల చిత్రాలు కూడా. గ్యాలరీ తర్వాత యారోను అనుసరించి ముందుకు వెళ్తే చిన్న థియేటర్ వస్తుంది. అందులో చిన్న చిన్న సినిమాల ప్రదర్శన రన్ అవుతూ ఉంటుంది. సిక్కు వీరుల కథనాలతో కూడిన పది– పదిహేను నిమిషాల నిడివి షోలవి. వాటిని చూసిన తర్వాత బయటకు వస్తే ఒక చోట పొడవైన క్యూ, అక్కడ ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది.
గురుద్వారాలో ఎక్కడా ఫొటోలు తీయడానికి వీల్లేదు. గురుద్వారాను చూడడం పూర్తయిన తరవాత తల మీద కప్పుకోవడానికి ఇచ్చిన స్కార్ఫ్‌ను ఇచ్చేసి, చెప్పులు తీసుకుని బయటకు రావాలి. మొత్తంగా సిక్కుల విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కడుతుంది ఈ గురుద్వారా పర్యటన.