అందాల అగుంబే.. ఒక్కసారైనా చూడాల్సిందే..

కర్నాటక రాష్ట్రంలోని ఉడుపికి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగుంబేలో ఏడాదంతా అడపాదడపా వర్షపాతం నమోదవుతుంది. అందుకే దీన్ని ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటుంటారు.

Advertisement
Update:2023-08-08 10:45 IST

అందాల అగుంబే.. ఒక్కసారైనా చూడాల్సిందే..

ఒక్కరోజు వర్షం కురిస్తేనే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలాంటిది ప్రతిరోజూ వర్షం కురుస్తుంటే.. ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన ఎక్స్‌పీరియెన్స్ పొందాలంటే కర్నాటకలో ఉన్న అగుంబేకు వెళ్లాలి. ‘చిరపుంజి ఆఫ్ సౌత్‌’గా పిలిచే ఈ ప్రాంతం ప్రత్యేకతలేంటంటే..

కర్నాటక రాష్ట్రంలోని ఉడుపికి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగుంబేలో ఏడాదంతా అడపాదడపా వర్షపాతం నమోదవుతుంది. అందుకే దీన్ని ‘చిరపుంజి ఆఫ్ సౌత్’ అంటుంటారు. ఇక్కడ తరచుగా వర్షపు చినుకులు పలకరిస్తుంటాయి. ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది.

అందమైన జలపాతాలతో పాటు పచ్చని కొండల సౌందర్యానికి అగుంబే పెట్టింది పేరు. మాన్‌సూన్‌లో ఒక్కసారైనా చూడాల్సిన చోటు ఇది. అగుంబేలో కొండల్ని తాకుతూ వెళ్లే మబ్బులు, అటవీ జంతువులు, జలపాతాలు ఎటుచూసినా సహజ అందాలే దర్శనమిస్తాయి. ఇక్కడుండే కుంచికాల్ ఫాల్స్.. దేశంలోనే ఎక్కువ ఎత్తు నుంచి పడుతున్న జలపాతాల్లో ఒకటి. ఇది 1493 అడుగుల ఎత్తు నుంచి పడుతూ చూసేవాళ్లకి చిన్నపాటి నయాగారాలా అనిపిస్తుంది. బర్కానా అనే మరో ఫాల్స్.. 850 అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. దీన్నే సీతా జలపాతం అని కూడా పిలుస్తుంటారు.

ఇక వీటితోపాటు ఒనకి వాటర్ ఫాల్స్, 829 అడుగుల ఎత్తునుంచి కింద పడే జోగి ఫాల్స్, 126 అడుగుల ఎత్తునుంచి కింద పడే తీర్థ జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయి. జలపాతాలను చేరుకునేందుకు అడవి మార్గంలో కొంతదూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇక అగుంబేలో ఉండే మరో స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడి సన్ సెట్. ఎంతో ఎత్తులో ఉండే అగుంబే కొండలపై నుంచి చూస్తే.. అరేబియా సముద్రం మీదుగా అస్తమిస్తున్న సూర్యుడు దర్శనమిస్తాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు.

అగుంబే.. మంగుళూరు విమానాశ్రయానికి 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగుళూరు నుంచి క్యాబ్ లేదా టాక్సీలో అగుంబే చేరుకోవచ్చు. లేదా ఉడుపి రైల్వే స్టేషన్‌లో దిగి బస్సు, క్యాబ్‌లో కూడా అగుంబే చేరుకోవచ్చు. ఈ ప్లేస్‌లో ఫుడ్, స్టే కు ఎలాంటి లోటు ఉండదు. బోలెడు రిసార్ట్‌లు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News