ఎస్‌యూవీలో ప్రయాణం కిలోమీటరుకు 3 రూపాయలు
సుశీల్ రెడ్డి నిర్ణయించుకున్న క్వాడ్రలేటరల్ రూట్‌లో 13 రాష్ట్రాలలో పర్యటన సాగింది. అందులో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి వంటి మహానగరాలతోపాటు మొత్తం 35 నగరాల మీదుగా 70 రోజులపాటు సాగిన ప్రయాణంలో 8849 కిలోమీటర్లు ప్రయాణించింది వాహనం.
అభివృద్ధిలో భాగంగా సాంకేతికత నిరంతరం వెల్లి విరిస్తూనే ఉండాలి. ఆ అభివృద్ధి మనిషి జీవితాన్ని కొత్త పుంతల్లో నడిపించి తీరుతుంది. అయితే ఆ కొత్త దారిని స్వీకరించడానికి సమాజం ఎప్పుడు కొంచెం వెనుకాడుతూనే ఉంటుంది.
వంటగదిలో ఎల్‌పీజీ గ్యాస్‌కు అలవాటు పడడానికి దశాబ్దాలు పట్టింది. అలాగే సీఎన్‌జీ వాహనాలను స్వాగతించడాకి కూడా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వంతు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి, సరైన అవగాహన కలిగించడానికి ముంబయికి చెందిన తెలుగు యువ ఇంజనీర్ సుశీల్ రెడ్డి ఎలక్ట్రిక్ దేశపర్యటన చేశాడు. ఆ వివరాలు చూద్దాం.
ఇలా సాగింది!
సుశీల్ రెడ్డి నిర్ణయించుకున్న క్వాడ్రలేటరల్ రూట్‌లో 13 రాష్ట్రాలలో పర్యటన సాగింది. అందులో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి వంటి మహానగరాలతోపాటు మొత్తం 35 నగరాల మీదుగా 70 రోజులపాటు సాగిన ప్రయాణంలో 8849 కిలోమీటర్లు ప్రయాణించింది వాహనం.
ద సన్ పెడల్ రైడ్
ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీలో ఎమ్‌జి జడ్‌ఎస్ ఈవీలో మొదలైంది సుశీల్ ప్రయాణం. మరికొంతమంది స్నేహితులతో కలిసి మొదలు పెట్టిన ఈ ప్రయాణం... వాళ్లు వెళ్లిన నగరాల్లోని స్కూళ్లు, కాలేజీలలో 'క్లీన్ ఎనర్జీ, సస్టెయినబుల్ మొబిలిటీ' గురించి ప్రసంగాలు, సందేశాలిస్తూ ముందుకు సాగింది. సుశీల్ తాను వెళ్లిన ప్రతిచోటా స్థానికులను సమావేశ పరిచి ఎలక్ట్రికల్ వాహనం గురించి వివరించడంతోపాటు 'మీరు నడిపి చూడండి' అని ఆఫర్ ఇచ్చేవాడు. అతడి ఆహ్వానాన్ని అందుకుని కొంతమంది ఉత్సాహవంతులు వాహనాన్ని నడిపి సంతోషించారు.
ఎలక్ట్రికల్ వాహనాల పట్ల ఉన్న సందేహాలను తొలగించడానికి రూపొందించిన గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇది. ఇదే పని విదేశాల్లో ఎవరైనా చేసి చూపిస్తే... 'ఆ దేశాల రోడ్లలో అయితే ఓకే, కానీ మనదేశంలో వర్కవుట్ కాదు' అని పెదవి విరిచేస్తాం. కానీ ఇప్పుడిది మనదేశంలో నిరూపితమైన వాస్తవం.
సుశీల్ ట్రాక్ రికార్డ్!
సన్ పెడల్ రైడ్ అవేర్‌నెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇండియాలో ఈ ప్రయోగాన్ని తన భుజాలకెత్తుకున్న సుశీల్ రెడ్డి గతంలోనూ ఓ రికార్డు సృష్టించాడు. అతడు ఐఐటీ బాంబే నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎమ్‌టెక్ డ్యుయల్ డిగ్రీ చేశాడు. సోలార్ ఎనర్జీ సెక్టార్లో పని చేసిన అనుభవం ఉంది. అతడు 2016లో సోలార్ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ బైసైకిల్‌ను 7,424 కిలోమీటర్ల దూరం నడిపి చూపించాడు. అది కూడా దాదాపుగా దేశపర్యటన వంటిదే. 79 రోజుల పాటు సాగిన ఆ 'ఈ సైకిల్ ప్రయాణం' 'ద లాంగెస్ట్ జర్నీ ఆన్ ఏన్ ఈ బైసైకిల్'గా గిన్నిస్ బుక్‌లో రికార్డయింది.