తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే..?

బీఆర్ఎస్ ని దెబ్బకొట్టి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నా.. ఆ స్థాయిలో హస్తం పార్టీకి సీట్లు వస్తాయా అనేది అనుమానమే. సర్వేలన్నీ కేసీఆర్ హ్యాట్రిక్ నే బలపరుస్తున్నాయి.

Advertisement
Update:2023-07-16 08:41 IST

Telangana Congress CM Candidate 2023: తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరంటే..?

అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన రెండు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఉచిత విద్యుత్ ని బీఆర్ఎస్ పూర్తిగా టార్గెట్ చేసింది. ఇక సీతక్క సీఎం కావొచ్చంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. ఆశావహులు, సీనియర్లు.. అందరూ ఈ స్టేట్ మెంట్ ని జీర్ణించుకోలేకపోయారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే బయటపడ్డారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా తన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసేది అధిష్టానం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

ఆలూ లేదు చూలూ లేదు సీఎం అభ్యర్థి పేరేంటి అన్నట్టుగా ఉంచి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ ని దెబ్బకొట్టి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నా.. ఆ స్థాయిలో హస్తం పార్టీకి సీట్లు వస్తాయా అనేది అనుమానమే. సర్వేలన్నీ కేసీఆర్ హ్యాట్రిక్ నే బలపరుస్తున్నాయి. వరుసగా రెండు దఫాలు అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలవరపడుతున్నాయి. ఈ దశలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.

సీనియర్లు ఇంతమంది ఉండగా, సీతక్క సీఎం ఏంటి అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్న సీనియర్ల పేర్లు చదివి వినిపించారు. తాజాగా మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ ఇచ్చారు. ముందు పార్టీ అధికారంలోకి రావాలని, ఆ తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు. అదికూడా అధిష్టానం చూసుకుంటుందని, తమకి సంబంధం లేదన్నారు. ఆ నిర్ణయానికే అందరం కట్టుబడి ఉంటామన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వ్యవహారంపై స్పందించినా, సీఎం అభ్యర్థి వ్యాఖ్యలపై మాత్రం ఇంకా వివరణ ఇవ్వలేదు. బహుశా ఆ అంశంపై స్పందించ కూడదని రేవంత్ బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. 

Tags:    
Advertisement

Similar News