అదానీ-రేవంత్‌ల ఫొటో ఫ్లెక్సీలతో రాహుల్‌కు స్వాగతం
కులగణన కోసం సన్నాహాక సమావేశంలో పాల్గొనడానికి వస్తున్న రాహుల్‌కు రేవంత్-అదానీ బంధాని తెలుపుతూ ఫ్లెక్సీలు
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన వేళ ఫ్లెక్సీలు వెలిశాయి. పారిశ్రామిక వేత్త అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలపై రాహుల్ గాంధీకి స్వాగతం అంటూ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కోసం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేనున్నది. సమావేశానికి హాజరుకావడానికి నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలుచోట్ల సీఎం రేవంత్, అదానీ కలిసి ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ ఆయన తన మిత్రుడు అదానీ ప్రజల కోసమే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నది. రాహుల్ గాంధీ అయితే పార్లమెంట్ వేదికగానే మోదీ-అదానీ బంధంపై అనేకసార్లు విరుచుకుపడ్డారు. అదానీ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదికలపైనా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో చర్చకు పట్టుబట్టింది. ఇటీవల సెబీ చీఫ్, అదానీ కంపెనీల మధ్య వాణిజ్య భాగస్వామ్యంపైనా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్గీ ద్వంద్వ విధానాలపై బీఆర్‌ఎస్ విరుచుకుపడుతున్నది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ అదానీ-సీఎం రేవంత్ రెడ్డిల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలతో రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు వెలియడం గమనార్హం.