తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే : సీఐఐ సమావేశంలో మంత్రి కేటీఆర్

మీ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అధికారం వస్తుందనిపిస్తోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-03-07 16:18 IST

తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సీఐఐ సదస్సులు మరిన్ని జరుపుకుందామని ఆయన తెలియజేశారు. బేగంపేటలోని టూరిస్ట్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన చెప్పారు. ఇటీవల హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బయో ఏసియా సదస్సు విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరుగుతున్న ఈ సమావేశంలో తాను పాల్గొంటున్నాను. 2023లో మాకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టండని కోరారు. మీ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అధికారం వస్తుందనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. జినోమ్ వ్యాలీలో మెడికల్ డివైజెస్ పార్క్‌ను విస్తరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని మంత్రి తెలిపారు. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల విలువైన రంగంగా ఇది మారబోతోందని కేటీఆర్ అంచనా వేశారు.

హైదరాబాద్‌కు ఎన్నో అనుకూలతలు, బలాలు ఉన్నాయి. ఇక్కడ నుంచే ప్రతీ ఏడాది 9 బిలియన్ టీకాలు ఉత్పత్తి అవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలో తయారవుతున్న టీకాల్లో ఇవి 35 శాతమని, దేశీయ ఉత్పత్తిలో 40 శాతమని మంత్రి చెప్పారు. యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదించిన ఫార్మా మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందని అన్నారు. ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని.. సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లైఫ్ సైన్సెస్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరబాద్ అత్యుత్తమ వేదికగా మారిందని అన్నారు.

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా అంటే రాష్ట్రాల సమూహమని.. మేకిన్ ఇండియా మంచి నినాదమని మంత్రి అన్నారు. కానీ అది సక్రమంగా అమలు అయ్యిందా అంటే ఎవరి వద్దా సమాధానం ఉండదన్నారు. బలమైన రాష్ట్రాల వల్లే బలమైన దేశం తయారవుతుందని తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వంటి రాష్ట్రాలకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఇస్తే.. మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీస్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఐఐ తెలంగాణ చైర్మన్ వాజిశ్ దీక్షిత్, సీఐఐ సౌత్ ఇండియన్ రీజియన్ చైర్ పర్సన్ సుచిత్రా ఎల్లా, కైటెక్స్ గార్మెంట్స్ ఎండీ సాబు ఎం జాకొబ్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    
Advertisement

Similar News