వానాకాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు?

కుల గణన రీ సర్వేతో షెడ్యూల్‌ కు బ్రేక్‌

Advertisement
Update:2025-02-12 21:06 IST

స్థానిక సంస్థల ఎన్నికలు వానాకాలంలోనే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పదవీకాలం ఏడాది క్రితమే ముగిసింది. కొన్ని నెలల క్రితం జిల్లా, మండల పరిషత్‌ ల కాలపరిమితి కూడా ముగిసింది. జీహెచ్‌ఎంసీతో పాటు శివారుల్లోని కొన్ని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల టర్మ్‌ కూడా అపోయింది. దీంతో గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు ఖాయమని అంతా అనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా ఇచ్చిన బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టపరమైన చిక్కులున్నాయి. ప్రభుత్వం డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసినా దాని ద్వారా కాకుండా ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా కులగణన నిర్వహించింది. అది కూడా తప్పుల తడకగా ఉండటంతో ఈనెల ఆఖరు వరకు రీ సర్వే చేయాలని నిర్ణయించింది. దీంతో కుల గణన సర్వే ముగిసిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంటే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కుల గణన సర్వే నివేదిక సభలో ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలపాలి. రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రం దగ్గర గట్టి ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు.

తమిళనాడు తరహాలో బీసీలకు స్థానిక సంస్థలతో పాటు ఉద్యోగ, విద్యరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ సహా అన్ని రాజకీయ పక్షాలు బీసీల డిమాండ్లకు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు పార్లమెంట్‌ రాజ్యాంగ పరమైన రక్షణలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆలస్యమయ్యే పక్షంలో కాంగ్రెస్‌ పార్టీపరంగా 42 శాతం స్థానాలు కల్పించి ఎన్నికలకు వెళ్లాలి మొదట్లో కాంగ్రెస్‌ భావించింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటనపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో ఉండే ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వానాకాలం వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News