మొన్న కరెంటు, ఇప్పుడు రైతుబంధు.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల టైంలో రైతుబంధు ఆపాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందుగానీ, పోలింగ్ ముగిసిన తర్వాత గానీ విడుదలయ్యేలా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్, తెలంగాణలో ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని హస్తం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎలక్షన్ హీట్‌ను మరింత పెంచాయి. ఇప్పటివరకూ విద్యుత్ అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడవగా.. తాజాగా రైతుబంధు అంశం కూడా రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది.
రెండు రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ఎన్నికల టైంలో రైతుబంధు ఆపాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందుగానీ, పోలింగ్ ముగిసిన తర్వాత గానీ విడుదలయ్యేలా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. పింఛన్లు సహా ఇతర నగదు ప్రయోజనాల పంపిణీని 27 రోజుల పాటు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఇది రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది.
అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కాంగ్రెస్ రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరిందని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. మరోవైపు రైతుబంధును ఆపాలన్న హస్తం పార్టీ తీరుకు నిరసనగా ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కర్ణాటకలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తంగా రైతు అంశమే ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఫైట్ నడుస్తోంది.