విజయశాంతి.. మరో కీలక అప్ డేట్
అంతా అయిపోయాక విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మరి ఆమెకు లభించిన హామీ ఏంటి అనేది తేలాల్సి ఉంది. మెదక్ నుంచి ఆమె లోక్ సభకు కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేసే అవకాశముంది. అయితే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.
విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు కొన్నిరోజులు గ్యాప్ తీసుకున్నారు. ఇటీవల కీలక నేతలంతా ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. ఇక్కడ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, అక్కడ చేరబోయే పార్టీనుంచి ఎవరో ఒకరు వచ్చి వారిని ఆహ్వానించినట్టు, ఆ తర్వాత వారు కండువా కప్పుకున్నట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే విజయశాంతి ఎపిసోడ్ లో ఈ ఆహ్వానాలేవీ లేనట్టు తేలిపోయింది. పార్టీ మారే సమయంలో ఆమె కొన్నిరోజుల గ్యాప్ తీసుకున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే.. ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. కుత్బుల్లాపూర్ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలోనే విజయశాంతి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది.
విజయశాంతి ప్రచారం చేస్తారా..?
విజయశాంతి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. ఆమె కూడా పలు కీలక సభల్లో పాల్గొంటారు. రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ సభలకు కూడా ఆమె ప్రత్యేక ఆకర్షణగా ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పై ఆమె విమర్శనాస్త్రాలు సంధించే అవకాశముంది. బీజేపీలో తనకు జరిగిన అవమానాలను, ఆ పార్టీ అసమర్థతను ఆమె ఏకరువుపెడుతుందని అంటున్నారు. ప్రచారం ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ రోడ్ షో లలో విజయశాంతి పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
హామీ ఏంటి..?
అంతా అయిపోయాక విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మరి ఆమెకు లభించిన హామీ ఏంటి అనేది తేలాల్సి ఉంది. మెదక్ నుంచి ఆమె లోక్ సభకు కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేసే అవకాశముంది. అయితే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడితే, లోక్ సభ ఎన్నికలనాటికి ఆ పార్టీ టికెట్లకు పెద్దగా పోటీ ఉండదు. మరి లోక్ సభ టికెట్ హామీతో విజయశాంతికి ఏమేరకు లాభదాయకమో ముందు ముందు తేలిపోతుంది.