నా పుట్టలో వేలు పెడితే కంప్లయింట్ చేయనా..?

తన జిల్లాలో కార్యక్రమం పెడుతూ, తనకు సమాచారం లేకపోవడం ఏంటని ఉడుక్కున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, తమకు సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారాయన.

Advertisement
Update:2023-04-19 16:17 IST

ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా... తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఆధిపత్యపోరు సమసిపోయినట్టు లేదు. ఇన్ చార్జ్ ని మార్చి అధిష్టానం ప్రయోగం చేసినా ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. రేవంత్ రెడ్డిపై ప్రత్యర్థి వర్గం రగిలిపోతూనే ఉంది. తాజాగా ఆయనపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

కోపం ఎందుకు..?

ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపానికి కారణం ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ నెల 21న నల్గొండ జిల్లాలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ నిర్వహించబోతున్నట్టు ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ వివరాలు మీడియాలో తెలుసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకయ్యారు. తన జిల్లాలో కార్యక్రమం పెడుతూ, కనీసం తనకు సమాచారం లేకపోవడం ఏంటని ఉడుక్కున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, కనీసం తమకు వాటిపై సమాచారం కూడా ఇవ్వడం లేదని అంటున్నారాయన. రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మాకంటే ముందు మీడియాకా..?

పీసీసీ అధ్యక్ష హోదాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు సరే, కనీసం పార్టీలో వాటి గురించి చర్చించాల్సిన పనిలేదా అని ప్రశ్నిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ నిర్ణయాలను మీడియాకంటే ముందే తమకు తెలియజేయాలంటున్నారు. తీరా మీడియాలో చూసి తెలుసుకుని షాకవుతున్నామని, ఇదెక్కడి సమన్వయం అంటున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీడియాకు వివరిస్తే స్థానిక పార్టీ శ్రేణులను ఎలా ఒప్పించగలరని ప్రశ్నించారు.

రేవంత్ కి ఆహ్వానం లేకుండానే..

ఇటీవల సంగారెడ్డిలో ఇఫ్తార్‌ విందు ఇచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రేను ఆహ్వానించారు. కానీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పిలవలేదు. దీంతో వారి మధ్య విభేదాలు మరోసారి బయటపడినట్టయింది. తాజాగా రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News