రెప్పపాటు కూడా కరెంట్ పోవద్దు
ఎండాకాలం డిమాండ్‌కు అనుగుణంగా కరెంట్ అందుబాటులోకి తెస్తాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రెప్పపాటు కూడా కరెంట్ పోవద్దని విద్యుత్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం ఎండాకాలం కరెంట్ డిమాండ్, ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరాపై సెక్రటేరియట్‌లో ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని అధికారులతో సమీక్షించారు. రాబోయే ఎండాకాలం డిమాండ్ కు అనుగుణంగా కరెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిరుడు ఎండాకాలంలో హయ్యెట్ పవర్ డిమాండ్ ఎంత? ఈ సంవత్సరం ఎంతవరకు ఉంటుంది అనే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ సరఫరా అత్యంత సున్నితమైన అంశమని.. నిత్యావసరమని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. లైన్‌మన్ నుంచి మంత్రి వరకు ఒక కుటుంబంలా పని చేస్తేనే నిరంతరాయం కరెంట్ సరఫరా సాధ్యమవుతుందన్నారు.
హైదరాబాద్ తరహాలో గ్రామీణ ప్రాంతాలకు ఎమర్జెన్సీ వెహికల్స్ అందుబాటులోకి తెచ్చి అత్యవసర సేవలు అందజేయాలన్నారు. మార్చి నెల ఆరంభం నాటికి నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ల పనులు పూర్తి చేయాలన్నారు. గత మూడేళ్లగా సబ్ స్టేషన్లపై పెరుగుతున్న పవర్ లోడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో బాగా పని చేసే వారిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తామన్నారు. కరెంట్ సరఫరాలో సమస్యలు సహా ఇతర అంశాలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 1912 పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కరెంట్ బిల్లులపైనా ఈ హెల్ప్‌లైన్ నంబర్ ప్రింట్ చేసి ఇవ్వాలన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, ముషారఫ్ అలీ, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.