త్వరలోనే పది స్థానాల్లో ఉప ఎన్నికలు

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్తరు : మాజీ సీఎం కేసీఆర్‌

Advertisement
Update:2025-02-11 19:41 IST

బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌ లో చేరిన పది మందిపై అనర్హత వేటు పడటం ఖాయమని.. త్వరలోనే ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. మంగళవారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో కేసీఆర్‌ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధర్మసాగర్‌ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు సహా పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్టేషన్‌ ఘన్‌పూర్‌ కు జరిగే ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడిపోయి డాక్టర్‌ రాజయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం తీరుపై ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని అన్నారు. పది నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలు ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ రాజయ్య మాట్లాడుతూ, ఈనెల 15న స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ లో చేరుతారని తెలిపారు. తెలంగాణ భవన్‌ లో నిర్వహించే కార్యక్రమంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో వారందరూ పార్టీలో చేరుతారని అన్నారు.

Tags:    
Advertisement

Similar News