బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలే
మాజీ మంత్రి హరీశ్ రావు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ పని అయినా ఈ ఆలయం నుంచే ప్రారంభిస్తారని.. తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఆలయం నుంచే ఆరంభించి సాధించారని అన్నారు. తెలంగాణకు పూర్వ వైభవం ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నానని తెలిపారు. కేసీఆర్ పాలనలో దేవాలను ఆయాలను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా ఆలయాలకు పైసా నిధులివ్వలేదని అన్నారు. మాట తప్పడం తప్ప నిలబెట్టుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి చేతకాదన్నారు. పంద్రాగస్టుకు రుణమాఫీ.. చబ్బీస్ జనవరికి రైతుభరోసా అని హామీలు ఇచ్చి మాట తప్పాడని గుర్తు చేశారు. కర్నాటక, తెలంగాణలో ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదు కాబట్టే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. ఫిబ్రవరి 11 ప్రాసిసెస్ డే అని.. ఈ రోజైనా తాను ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు.