ప్రభుత్వానికే కాదు.. ఆర్టీసీకి కూడా కత్తిమీద సామే

రద్దీ పెరుగుతుంది, సీట్ల దగ్గర గొడవలు మొదలవుతాయి, రద్దీ బస్సులో మహిళలకు జీరో టికెట్లు జారీచేయడం కష్టంగా ఉంటుంది. ప్రతి స్టాప్ లో బస్సుల్ని ఎక్కువ సమయం ఆపాల్సి ఉంటుంది.

Advertisement
Update:2023-12-09 07:05 IST

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు బలంగా పనిచేసిన హామీల్లో ఇది కూడా ఒకటి. ఆల్రడీ కర్నాటకలో కాంగ్రెస్ కి కలిసొచ్చిన ఈ హామీ.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉపయోగపడింది. హామీలివ్వడం, అమలుచేయడం.. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీలకు తప్పనిసరి. కానీ ఒక్కోసారి అవి అలవికాని హామీలయితే మాత్రం కండిషన్లు అప్లై అని సింపుల్ గా తేల్చేస్తారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అలాంటి రిస్క్ చేయలేదు. ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్ జెండర్లకు.. రాష్ట్ర పరిధిలో ఎక్కడినుంచి ఎక్కడికయినా, ఎన్నిసార్లయినా ప్రయాణం ఫ్రీ అని ఏకవాక్య తీర్మానం చేసేసింది. తెలంగాణ స్థానికులు అనేందుకు ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాలని మాత్రం చెప్పింది. ఈ కండిషన్ ను ఎవరూ తప్పుబట్టరు. అయితే పథకం అమలే ఇప్పుడు కత్తిమీద సాములా మారే అవకాశముంది.

ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి..?

ఉచిత ప్రయాణం అంటే వారి ప్రయాణ ఖర్చును ప్రభుత్వమే భరించాలి అని అర్థం. ఇప్పటికే స్టూడెంట్ పాస్ సహా, ఇతర అనేక పాసులకు ప్రభుత్వమే ఆర్టీసీకి టికెట్ల భారం చెల్లిస్తుంది. ఇప్పుడు మహిళల ప్రయాణాలకయ్యే ఖర్చుని కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కలకోసం జీరో టికెట్ ని ప్రవేశపెడుతున్నారు. ఈరోజు లాంఛనంగా పథకం ప్రారంభం అవుతున్న సందర్భంలో ఇప్పటికిప్పుడు టికెట్ ఇవ్వరు.. ఒకటి రెండు రోజుల్లో జీరో టికెట్ ప్రింట్ తీసి ఇచ్చే అవకాశాలున్నాయి. అంటే ఆర్టీసీకి కూడా లెక్క ఉంటుంది. ఏడాదికి ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు 3వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక ఈ పథకం అమలులోకి వస్తే ఆటోలకు గిరాకీ తగ్గుతుంది. ఆటోల్లో మహిళలు ఎక్కే అవకాశం తక్కువ. ఆమేర పురుషులు ఎక్కే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త వెసులుబాటు ఉండొచ్చు. నిబంధనలు పెట్టకుండా ఈ పథకం కొనసాగిస్తేనే ప్రభుత్వానికి మనుగడ. భారం పెరిగిందని, ఏమాత్రం మార్పులు చేర్పులు చేసినా తర్వాత మహిళా ఓట్లతో ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఆర్టీసీకి కష్టం..

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే సిబ్బందికి కత్తిమీద సాము అని చెప్పాల్సిందే. ఇప్పటికే కర్నాటకలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మహిళా ప్రయాణికుల రద్దీతో తొలిరోజుల్లో కర్నాటక ఆర్టీసీ స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు. రద్దీ పెరుగుతుంది, సీట్ల దగ్గర గొడవలు మొదలవుతాయి, రద్దీ బస్సులో మహిళలకు జీరో టికెట్లు జారీచేయడం కష్టంగా ఉంటుంది. ప్రతి స్టాప్ లో బస్సుల్ని ఎక్కువసమయం ఆపాల్సి ఉంటుంది. పండగలు, ఇతర సీజన్లలో ఈ రద్దీని తట్టుకోవడం బాగా కష్టం. కొత్త బస్సులు వేయాలంటూ చాలా ప్రాంతాలనుంచి డిమాండ్లు మొదలవుతాయి.

ప్రస్తుతం తెలంగాణలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సేవలను అందిస్తుంది. ఇటీవల కొత్తగా 776 బస్సులను టీఎస్ఆర్టీసీ తీసుకుంది. మరో 1,050 బస్సులు రావాల్సి ఉంది. అద్దె ప్రాతిపదికన మరో వెయ్యి విద్యుత్ బస్సులు కూడా వస్తాయని చెబుతున్నారు అధికారులు. బస్సులకు సమస్య లేదని స్పష్టం చేశారు. రద్దీ స్టేషన్లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలని, ఏమాత్రం కోప్పడవద్దని, సహనంతో ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. తొలి వారం రోజులు ఐడీ కార్డులు చూపించకపోయినా ప్రయాణానికి అనుమతించాలని, ఆ తర్వాత స్థానికత చూపించే ఐడీ కార్డులు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో జీరో టికెట్ కూడా ప్రవేశపెడతామని చెప్పారు. ఉచిత ప్రయాణం మొదలైన తొలిరోజుల్లో కష్టంగానే ఉన్నా.. తర్వాత ప్రయాణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉండదని, అప్పటి వరకు ఓపికగా ఉండాలని సిబ్బందికి సూచిస్తున్నారు అధికారులు. మొత్తమ్మీద ఈ కొత్త పథకం మహిళలకు వరమే అయినా.. ఆర్టీసీకి, ప్రభుత్వానికి మాత్రం ఓ పరీక్షలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News