మంథనిలో ముక్కోణపు పోరు.. ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారో..?
బీజేపీ టికెట్ దక్కించుకున్న చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఎంతవరకు ప్రభావం చూపుతారు..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఈసారి ముక్కోణపు పోరుకు వేదిక కాబోతుందా..? మాజీ మంత్రి కాంగ్రెస్ కీలకనేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన సిటింగ్ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంటారా..? బీఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధూకర్ గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా..? బీజేపీ టికెట్ దక్కించుకున్న చంద్రుపట్ల సునీల్‌రెడ్డి ఎంతవరకు ప్రభావం చూపుతారు..? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
శ్రీధర్‌బాబు రెండో హ్యాట్రిక్ వైపు అడుగులేస్తారా..?
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇక్కడ ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్‌పై గెలిచారు. తండ్రి, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు కాల్చి చంపడంతో ఆయన వారసుడిగా శ్రీధర్‌బాబు రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేనినెట్‌ల్లో మంత్రిగానూ పని చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి రెండో హ్యాట్రిక్ వైపు అడుగులేయాలని పట్టుదలతో ఉన్నారు.
ప్రజారాజ్యంలోనూ సత్తా చాటిన పుట్ట మధు
పుట్ట మధు 2009 ఎన్నికల్లో రన్నరప్‌గా నిలిచారు. ఆ ఎన్నికల్లో తొలిసారి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీలో దిగి ఏకంగా 50,561 ఓట్లు సాధించి సంచలనం సృష్టించినా శ్రీధర్‌బాబు చేతిలో ఓటమి తప్పలేదు. 2014 నాటికి టీఆర్ఎస్‌లో చేరి అదే శ్రీధర్‌బాబుపై దాదాపు 20వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
సునీల్‌రెడ్డి పోటీ .. ఎవరికి చేటు?
ఇక తాజా జాబితాలో మంథని బీజేపీ టికెట్ దక్కించుకున్న చంద్రుపట్ల సునీల్‌రెడ్డి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిలబడి 6,500 ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి చంద్రుపట్ల రామ్‌రెడ్డి మంథని నుంచి మూడుసార్లు పోటీ చేశారు. 1999లో టీడీపీ నుంచి బరిలో నిలిచి దుద్దిళ్ల శ్రీపాదరావును ఓడించి సంచలనం సృష్టించారు. తర్వాత ఎన్నికల్లో శ్రీధర్‌బాబు చేతిలో ఓడారు. గత ఎన్నికల తర్వాత ఈ తండ్రీ కొడుకులిద్దరూ బీఆర్ఎస్‌లో చేరారు. రెండేళ్ల కిందట బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ టికెట్ తెచ్చుకున్న సునీల్‌రెడ్డి తన తండ్రి పరిచయాలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తానని నమ్మకంగా ఉన్నారు. సునీల్ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు, అవి శ్రీధర్‌బాబుకు సెగ రేపుతాయా, మధుకు మంట పెడతాయా తేలాలంటే వేచి చూడాల్సిందే.