ఈ రోజు తెలంగాణ భగత్ సింగ్ గా పేరు గాంచిన అనభేరి ప్రభాకర్‌రావు 75వ వర్ధంతి

భూస్వామ్య‌ కుటుంబంలో జన్మించిన ప్రభాకర్‌రావు కమ్యూనిజం వైపు ఆకర్షితుడై పేదల కోసం పోరాడారు. అతను విప్లవ ఉద్యమాలను అధ్యయనం చేశాడు. నిజాంకు,భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

Advertisement
Update:2023-03-14 11:53 IST

తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు అనభేరి ప్రభాకర్ రావు మరణించి ఈ రోజుకు 75 సంవత్సరాలు.

తెలంగాణ భగత్ సింగ్‌గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ రావు మార్చి 14, 1948న హుస్నాబాద్ సమీపంలోని మహమ్మదాపూర్ కొండల్లో నిజాం సైన్యం తూటాలకు బలయ్యారు.

భూస్వామ్య‌ కుటుంబంలో జన్మించిన ప్రభాకర్‌రావు కమ్యూనిజం వైపు ఆకర్షితుడై పేదల కోసం పోరాడారు. అతను విప్లవ ఉద్యమాలను అధ్యయనం చేశాడు. నిజాంకు,భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు.

ప్రభాకర్ రావు 1910 ఆగస్టు 15న తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో వెంకటేశ్వరరావు, రాధాబాయి దంపతులకు జన్మించారు.

నిజాం కళాశాలలో చదువుతున్నప్పుడు, అతను స్వాతంత్య్ర‌ సమరయోధులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ల‌ భావజాలం నుండి ప్రేరణ పొందాడు. అక్కడే ఆయన రష్యా విప్లవం గురించి తెలుసుకొన్నారు.

ఆంధ్ర మహాసభ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి జిల్లా అధ్యక్షుడు బద్దం ఎల్లారెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రభాకర్‌రావు నేతృత్వంలో దళం ఏర్పాటు చేసి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు.

భూస్వాములు, జమీందార్లు అక్రమంగా ఉంచుకున్న పేదల భూమి పట్టా పత్రాలను ప్రభాకర్ రావు నేతృత్వంలోని దళం దగ్ధం చేసింది.

సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా, అప్పటి హైదరాబాద్ నిజాం ప్రైవేట్ సైన్యమైన రజాకార్లను కూడా దళం ఎదుర్కొంది.

ప్రభాకర్ రావుకు తాలుక్దార్ కలెక్టర్ పదవిని ఇస్తానని నిజాం ఆఫర్ చేశాడు. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించి పేదల కోసం పోరాడారు ప్రభాకర్ రావు. ఒక దశలో నిజాం ప్రభాకర్ రావుపై ‘నజర్ బంద్’ ఆదేశాలు జారీ చేశారు.

1948 మార్చి 14న హుస్నాబాద్ సమీపంలోని మహ్మదాపూర్ గుట్టల్లో నిజాం పోలీసులు, రజాకార్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో దళంలోని మొత్తం 12 మంది చనిపోయారు. జిల్లాలో జరిగిన తొలి ఎన్‌కౌంటర్ ఇది. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం.

అనభేరి ప్రభాకర్‌రావు తో పాటు, తూమోజు నారాయణ, పాపయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి, బలరాంరెడ్డి తదితరులు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

ఎన్‌కౌంటర్‌ జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మహ్మదాపూర్‌లో సీపీఐ జిల్లా విభాగం ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News