తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం.. నిబంధనలు పక్కకు పెడుతున్న బీజేపీ!

బీజేపీలో ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలనే నిబంధన ఉన్నది. ప్రభుత్వంలో పదవి ఉంటే.. పార్టీ పదవికి దూరంగా ఉంచుతారు.

Advertisement
Update:2023-07-01 07:19 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి, అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ ఎక్కడా అధికారంలో లేదు. కర్ణాటకలో ఓటమి పాలవ్వడంతో.. ఇప్పుడు ఫోకస్ తెలంగాణపై పెట్టింది. ఇప్పటికే పార్టీ బలాబలాలు తెలుసుకోవాడానికి క్షేత్ర స్థాయిలో స్వల్ప విస్తారక్‌లతో సర్వే చేయిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కొత్తగా పార్టీలో చేరిన వారికి విభేదాలు ఏర్పడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. బండి సంజయ్ కూడా పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయడం లేదని హైకమాండ్ భావిస్తున్నది. ఈ క్రమంలోనే కొత్తగా కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీలో ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలనే నిబంధన ఉన్నది. ప్రభుత్వంలో పదవి ఉంటే.. పార్టీ పదవికి దూరంగా ఉంచుతారు. గత కొన్నేళ్లుగా ఈ నిబంధన ప్రకారమే పార్టీ, ప్రభుత్వంలో పదవులు ఇస్తూ వస్తోంది. అయితే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ నిబంధన పక్కకు పెట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించినా.. కేంద్ర మంత్రి వర్గంలో కొనసాగిస్తారని తెలుస్తున్నది. తనకు కేంద్ర మంత్రి పదవి కొనసాగిస్తేనే, అధ్యక్ష బాధ్యతలు చేపడతానని కిషన్ రెడ్డి చెప్పడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అధ్యక్ష పదవి నుంచి తప్పించనున్న బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేదా పార్టీ జాతీయ నాయకత్వంలో పదవి కల్పించే అవకాశం ఉన్నది. ఈ రెండు నిర్ణయాలపై మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని కీలక నేత ఒకరు చెప్పారు. రాష్ట్రంలో బండి వర్గంతో ఇతరులకు విభేదాలు.. ఆయన పదవీ కాలం కూడా మూడేళ్లు పూర్తి కావడంతోనే ఈ మార్పులకు అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది.

కాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను పార్టీని ముందుకు తీసుకెళ్లానని.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మార్చానని.. తన సేవలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని బండి సంజయ్ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తప్పించినా.. కేంద్ర మంత్రి పదవి లేదా జాతీయ స్థాయిలో పార్టీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

'ఒకరికి ఒకటే పదవి' అనే నిబంధనను కేవలం తెలంగాణ విషయంలో పక్కకు పెడుతున్నామని.. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దేశమంతా ఈ నిబంధన పక్కకు పెడితే.. పార్టీలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. త్వరలోనే తెలంగాణలోని ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిపించి కీలక సమావేశం నిర్వహిస్తారని.. ఇందులో నాయకులు చెప్పే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర బీజేపీలో మార్పులు ఉంటాయని తెలుస్తున్నది. అంతే కాకుండా.. తెలంగాణ విషయం తేలిన తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు కూడా ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News