చట్టప్రకారం మేం చేయాల్సింది చేస్తాం.. సీఎస్ కు కేటీఆర్ అల్టిమేట్టం
డిజిటల్ ఆస్తులను రక్షించడం, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యం అని, దీనికి చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్ లు ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇటీవల తొలగించారు. దీనిపై స్పందించాలని, తొలగించిన సమాచారాన్ని తిరిగి ఆయా వెబ్ సైట్స్ లో పొందుపరచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇవి తెలంగాణ ప్రజల డిజిటల్ ఆస్తులు అని, వాటిని భవిష్యత్ తరాలకోసం భద్రపరచాలని సూచించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ, చీఫ్ సెక్రటరీ నుంచి కానీ స్పందన లేదు. మరోసారి ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా గుర్తు చేసిన కేటీఆర్.. మీరు స్పందించక పోతే చట్టప్రకారం తాము చేయాల్సింది చేస్తామని అల్టిమేట్టం ఇచ్చారు.
విభజనకు ముందు తెలంగాణ ఎలా ఉంది, విభజన తర్వాత దశలవారీగా ఎలా అభివృద్ధి చెందింది.. అనే వివరాలతోపాటు ఇతరత్రా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రణాళికలను ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్స్ లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పదేళ్లలో ప్రతి విభాగంలో జరిగిన ప్రగతిని సాధికారికంగా వివరించారు. సమగ్రంగా ప్రజల ముందుంచారు. ఈ సమాచారంలో ఎక్కడా అతిశయోక్తులు, అసత్యాలు లేవంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అధికారిక, సాధికారిక గణాంకాలతో ఆ సమాచారం ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం మారగానే దాన్ని తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఆ కంటెంట్ ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో అంతర్భాగం అని చెప్పారు.
డిజిటల్ ఆస్తులను రక్షించడం, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యం అని, దీనికి చీఫ్ సెక్రటరీ కూడా బాధ్యత తీసుకోవాలని సూచించారు కేటీఆర్. మొదట్లో మెయింటెనెన్స్ సమస్యగా ప్రభుత్వం కవర్ చేయాలనుకుంది. ఆ తర్వాత కూడా కీలక డేటా వెబ్ సైట్స్ నుంచి మాయం కావడం, దాన్ని తిరిగి పునరుద్ధరించకపోవడంతో బీఆర్ఎస్ సూటిగా ప్రశ్నిస్తోంది. కేటీఆర్ ట్వీట్ తో అయినా ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి.