కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోంది

ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి రూపం పుట్టింది : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-10 17:45 IST

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, మెతుకు ఆనంద్‌, నాయకుడు మన్నె గోవర్ధన్‌ రెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఏడాది పాలన విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి మంట కలిసిందని, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సినిమా పాటలు పాడించారని అన్నారు. ఈ మత్తులో పడే ఆ రోజు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. అరవై ఏళ్లు కాంగ్రెస్‌ నాయకులు ఈ మత్తులో పడి తెలంగాణ భాష, యాసలను తొక్కేశారని, సంస్కృతిని విధ్వంసం చేశారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే నిషేధించే స్థాయికి వెళ్లారని అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ లాంటి వాళ్లు ఉద్యమం చేశారని.. తెలంగాణ తల్లిని ఉమ్మడి పాలన నుంచి విముక్తం చేయాలని ఆరోజే కంకణం కట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ ఇరుసులా ఉండి ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు. అన్నీ రకాల సాంస్కృతిక దాడులను కేసీఆర్ తిప్పికొట్టారని, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినా, గోదావరి, కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహించినా కేసీఆర్‌ ఉద్యమం చలవేనన్నారు.

తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టిందని, దేవతా మూర్తిలా ఉండి ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందన్నారు. తెలంగాణ తల్లికి నాటి ఉద్యమమే భౌతిక రూపం ఇచ్చిందని, అనేక కళారూపాలతో ఆనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్నామని గుర్తు చేశారు. నిన్న తెలంగాణ తల్లి పేరుతో ఏ రూపాలను ప్రతిష్టించారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ తల్లిని చంపుతా అని తుపాకీ పట్టుకుని బయల్దేరిన వ్యక్తి కొత్త తల్లిని తీసుకొచ్చాడని, కిరాయి రాతగాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సీఎం చదివారని, ఇది తెలంగాణ సంస్కృతిపైన జరుగుతున్న భయంకర దాడి అన్నారు. దారితప్పిన ఆ దొంగల వెంట ఉన్న తెలంగాణవాదులు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాళ్లు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకమైన వాళ్లు అని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారని, సమైక్య వాదులు 80 యేండ్ల కింద పన్నిన కుట్ర మళ్లీ మొదలైందన్నారు. తెలంగాణ తల్లి పేరిట నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరికి తెలంగాణ భావోద్వేగం లేదన్నారు. ఉద్యమకాలంలో తెలంగాణ సంస్కృతిని మరిపించే ప్రయత్నాలు చేస్తే వాటిని తొప్పి కొట్టామన్నారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక బతుకమ్మ పండుగ అధికారికంగా నిర్వహించామని, మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చామన్నారు. సమైక్య బాస్‌లను సంతృప్తి పరిచేందుకే నిన్న కొత్త తల్లిని సృష్టించారని అన్నారు. తెలంగాణ సంస్కృతిని పరాధీనం చేసే కుట్ర జరుగుతోందని, తెలంగాణవాదులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తును ప్రచారం చేసుకోవడానికే కొత్త తల్లిని తెచ్చారని, ఎవర్ని భయపెట్టి కొత్త తల్లికి దండం పెంట్టించలేరని తేల్చిచెప్పారు. ప్రజల మెడపై కత్తి పెట్టి కొత్త తల్లిని ఆధారించాలనే ఆదేశించే హక్కు ఎవరికీ లేదన్నారు. తెలంగాణ ప్రజలు సృష్టించుకున్న తెలంగాణ తల్లికి అధికారిక గెజిట్‌లో స్థానం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చదువుకోలేదు కాబట్టే పిచ్చి జీవోలు తెస్తున్నారని, అధికారులు అలాంటి జీవో ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నారోనని అన్నారు. కోయిలలు ఉన్న చోట కాకిలా ప్రవర్తించి అందరి దృష్టిని ఆకర్షించాలనే మూర్ఖపు ఆలోచన ఈ ముఖ్యమంత్రిదని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News