తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ది ద్రోహ చరిత్రే

తెలంగాణకు నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీ : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-12-11 17:02 IST

తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డిది ద్రోహ చరిత్రేనని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. ఆయన చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు, ఉద్యమంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన రావడానికి కేసీఆరే కారణమన్నారు. ఎవరి దయతోనో ప్రకటన వచ్చిందని సీఎం చెబుతున్నారని, అది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమేనని మండిపడ్డారు. తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు కదా.. ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ అనే పదమే నిషేధించారని గుర్తుకు తెచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్, 16 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదం లేకుండా చేశారన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారనే విషయం తెలుసుకోవాలన్నారు.

2004 నుంచి 2009 వరకు బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని.. ఆ ప్రకటన లేకపోతే జూన్‌ 2 లేదన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటన నుంచి వెనక్కి తగ్గిన రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే రేవంత్‌ రెడ్డి చేయలేదన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తే ఉద్యమకారులపైకి రేవంత్‌ తుపాకీ పట్టుకొని వచ్చారని, ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. నెహ్రూ, గాంధీ పోరాటంతో బ్రిటిష్ వాళ్లే దయతలిచి దేశానికి స్వాతంత్య్రం ఇచ్చారని అన్నట్టుగా రేవంత్‌ మాటలు ఉన్నాయన్నారు. తెలంగాణ గురించి రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. లేకుంటే ఆయన రెండు కళ్ల సిద్ధాంతం గుర్తుకు వస్తుందన్నారు. సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే నోటితో దేవత అంటున్నారని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తామే తెలంగాణ తెచ్చామని చెప్తే చరిత్ర మారిపోతుందా అని ప్రశ్నించారు. ఎక్కడా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని సీఎం అన్నారని, 2015 జూన్‌ 2న సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారికంగా పెట్టామని చెప్పారు. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్‌ ఇప్పుడు తొలగిస్తారా అని ప్రశ్నించారు. 2023 జూన్‌ 22న సెక్రటేరియట్‌ దగ్గర కేసీఆర్‌ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రేవంత్‌ మార్చాల్సింది విగ్రహాలను కాదు తెలంగాణ ప్రజల బతుకులను అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, నాయకులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News