వైద్య పరికరాల తయారీ కేంద్రంగా మారుతున్న తెలంగాణ : మంత్రి కేటీఆర్
ప్రపంచ స్థాయి మేడిన్ తెలంగాణ ఉత్పత్తులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
వైద్య పరికరాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి వైద్య పరికరాలు తయారవుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ తయారు అవుతున్న వైద్య పరికరాల పని తీరును పరీక్షించేందుకు ఉద్దేశించిన ప్రొడక్ట్ టెస్టింగ్‌కు సంబంధించి ఆరు ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం తెలంగాణ మెడికల్ డివైజెస్ రంగంలో గొప్ప మార్పును తీసుకొని వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇక మరో మూడు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను మంగళవారం ఆవిష్కరించాయి. మెడికల్ డివైజెస్ రంగంలో మేడిన్ తెలంగాణ బ్రాండ్ దూసుకొని పోతుండటంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హ్యూవెల్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థ మెడికల్ డివైజెస్ పార్కులో ఇన్విట్రో డయాగ్నస్టిక్స్, రియాజెంట్‌లతో రెండు పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ (పీవోసీటీ) పరికరాలను అభివృద్ధి చేసింది. ఈ పరికరాల ద్వారా వివిధ రకాల అంటువ్యాధులను సులభంగా గుర్తించవచ్చు. ఈ కంపెనీ కింద వివిధ రకాల డయాగ్నస్టిక్స్ కిట్ల తయారీకి సంబంధించిన 20 లైసెన్సులు ఉన్నాయి.
ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ అనే కంపెనీని జీనోమ్ వ్యాలీలో రూ.25 కోట్ల పెట్టుబడితో నెలకొల్పారు. ఈ సంస్థను నెలకు రెండు మిలియన్ల క్షయ వ్యాధి నిర్ధారణ కిట్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ప్రారంభించారు. టీబీతో పాటు యాంటీ బయోటిక్ నిరోధకతను గుర్తించేందుకు కచ్చితమైన, సులభమైన, వేగవంతమైన, చవకైన డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్లను అభివృద్ధి చేసింది.
బ్లూ సెమీ అనే స్టార్టప్ కంపెనీ.. టీ-హబ్ సాయంతో ఈవైవీఏ అనే పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ పరికరం కేవలం చేతి వేళ్ల స్పర్శ ద్వారా 60 సెకెన్లలోనే నాన్-ఇన్‌వాసీవ్ బ్లడ్ గ్లూకోజ్ సహా రక్తంలోని ఆరు కీలక అంశాలను గుర్తిస్తుంది. సూదులు గుచ్చడం, నొప్పి వంటివి ఏవీ అవసరం లేకుండానే రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు, హృదయ స్పందన రేటు, ఈసీజీ, ఆక్సిజన్ స్థాయి, హెచ్‌బీఏ1సీ వంటివి కొలుస్తుంది.
మెడ్‌టెక్ రంగంలో పలు పరీక్షలకు సంబంధించి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం.. ప్రపంచ స్థాయి మేడిన్ తెలంగాణ ఉత్పత్తులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. దీని ద్వారా తెలంగాణ మెడ్‌టెక్ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించిందని చెప్పారు. హ్యూవెల్ లైఫ్ సైన్సెస్, ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్, బ్లూ సెమీ కంపెనీలు ఉత్పత్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవని.. ఇవి తెలంగాణలో తయారు కావడం గర్వ కారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.