టీజీఎస్‌ఆర్టీసీలో 3035 పోస్టుల భర్తీకి ఆమోదం

కారుణ్య నియామకాల్లో.. కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో, ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. త్వరితగతిన నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని టీజీఎస్‌ ఆర్టీసీ మంగళవారం వెల్లడించింది.

Advertisement
Update:2024-07-03 07:26 IST

తెలంగాణ ఆర్టీసీలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలన్నింటికీ పచ్చజెండా ఊపింది. దీంతో వివిధ కేటగిరీల్లో మొత్తం 3,035 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు. భర్తీ చేసే కొలువుల్లో మూడింట రెండొంతులు (2 వేలు) డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్‌ విభాగంలో 743 కొలువులు ఉన్నాయి.

ఆర్టీసీలో చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలోనే నియామకాలు జరిగాయి. 2012లో ఈ నియామకాలు చేపట్టగా.. ఆ తర్వాత 12 ఏళ్ల కాలంలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరోవైపు మహాల‌క్ష్మీ పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది. ఏటా పెద్ద సంఖ్యలో సిబ్బంది పదవీ విరమణలతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత ఎక్కువైంది. ఆయా పోస్టుల భర్తీతో ఏడాదికి రూ.100.80 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది. ఇక కారుణ్య నియామకాల్లో.. కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో, ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. త్వరితగతిన నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని టీజీఎస్‌ ఆర్టీసీ మంగళవారం వెల్లడించింది.

పోస్టుల భర్తీ ఇలా...

టీజీఎస్‌ఆర్టీసీలో పోస్టుల భర్తీ కేటగిరీల వారీగా ఇలా ఉండనుంది. డీఎం/ఏటీఎం పోస్టులు 25, అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ 15, శ్రామిక్‌ 743, డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) 114, డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) 84, డ్రైవర్‌ 2,000, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 23, సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) 11, అకౌంట్స్‌ ఆఫీసర్‌ 6, మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) 7, మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News