సీపీఎస్ తేనెతుట్టెను కదుపుతున్న టీ కాంగ్రెస్.. జగన్ పడుతున్న ఇబ్బందులు చూళ్లేదా?
సీపీఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్.. అలాంటి సీపీఎస్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ టీపీసీసీ నేతలు ప్రకటిస్తుండటం కొత్త పరిణామం.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్.. షార్ట్ కట్‌లో చెప్పాలంటే సీపీఎస్.. సింపుల్‌గా చెప్పాలంటే ఉద్యోగులు ప్రతి నెలా జీతంలో నుంచి కొంత దాచుకుంటే దానికి ప్రభుత్వం కొంత కలిపి, రిటైరయిన తర్వాత ఉద్యోగికి పెన్షన్ ఇచ్చే పథకం. ఈ సీపీఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్.. అలాంటి సీపీఎస్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటూ టీపీసీసీ నేతలు ప్రకటిస్తుండటం కొత్త పరిణామం.
మేం అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నాలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటన, ఉపాధ్యాయ ఖాళీల భర్తీతోపాటు సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలినవి ఎలా ఉన్నా సీపీఎస్ రద్దు అనే మాట ఆయన మాట్లాడటం పార్టీ నిర్ణయమా, లేక జీవన్‌రెడ్డి క్యాజువల్‌గా ఆ మాట అనేశారా అని టీ కాంగ్రెస్ శ్రేణులు తెగ ఆలోచిస్తున్నాయట.
ఏపీలో తలపట్టుకుంటున్న ప్రభుత్వం
తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ ఏపీలో వైఎస్ జగన్ ఎన్నికల ముందు ప్రకటించారు.అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా ఆ హామీ నెరవేర్చలేకపోయారు. సీపీఎస్ రద్దు చేయలేమని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పినా ఉద్యోగ సంఘాలు పట్టు వీడటం లేదు. సీపీఎస్ స్థానంలో తాము ఎలాంటి వాటా చెల్లించక్కర్లేని పాత పింఛన్ పథకం(ఓపీఎస్) కావాలని పట్టుబడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్)ను వైకాపా ప్రభుత్వం తెరపైకి తెచ్చినా ఉద్యోగులు నో అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎస్ రద్దుపై టీ కాంగ్రెస్ లీడర్లు చేస్తున్న ప్రకటనను ఉద్యోగులు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.