ఇప్పుడు వారణాసి ఎంపీ.. ఇకపై వయనాడ్ ఎంపీ
దక్షిణాదికి ఏమిచ్చారని ఇక్కడి ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు రేంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో నిషేధించాయన్నారు.
గత పదేళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారని, రాబోయే 20 ఏళ్లు వయనాడ్ ఎంపీ ప్రధానిగా ఉంటారని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేరళలోని వయనాడ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎంపీగా గెలిచే రాహుల్.. దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రోడ్ షో..
కేరళలోని వయనాడ్ లో కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చామని మోదీ అసత్యాలు చెబుతున్నారన్నారు. అదే నిజమైతే ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు ఎందుకు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిందని ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే బీజేపీ కోసం ఎలక్టోరల్ బాండ్స్ కొన్నవారి వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి.
బ్యాలెట్ పోరు కావాలి..
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు రేంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతోపాటు, ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే.. మనదేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు బీజేపీకి లేదన్నారాయన. దక్షిణాదికి ఏమిచ్చారని ఇక్కడి ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు రేంత్ రెడ్డి. అబ్ కీ బార్ 400 పార్ అనే బీజేపీ నినాదం వినడానికి బాగానే ఉంది కానీ.. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో నెగ్గేది కాంగ్రెస్సేనని ధీమాగా చెప్పారు. ఎన్నికలనగానే మోదీకి దక్షిణాది రాష్ట్రాలపై ప్రేమ పుట్టుకొస్తుందని, ఇటీవల ఆయన ఎక్కువగా ఇక్కడకు వస్తున్నారని అన్నారు. గతంలోనే గుజరాత్‌కు బుల్లెట్ రైలు ఇచ్చిన మోదీ.. కేవలం ఎన్నికలకోసం దక్షిణాదికి కూడా బుల్లెట్ రైలు అంటున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో నిషేధించాయన్నారు రేవంత్ రెడ్డి.