బండికి కొత్త బాధ్యతలు లేనట్లేనా..?

బండి సంజయ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో బీజేపీ అనూహ్య విజయాలను సాధించింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చేరింది.

Advertisement
Update:2023-07-09 11:41 IST

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి రెండు తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షులకు చోటు కల్పించింది అధిష్టానం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌తో పాటు మరో 8 మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 మందిలో సోము, బండితో పాటు పాటు హిమాచల్ ప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బిహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, చత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్, రాజస్థాన్ సీనియర్ నాయకుడు కిరోడీ లాల్ మీనా, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా ఉన్నారు.

బండి సంజయ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో బీజేపీ అనూహ్య విజయాలను సాధించింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చేరింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఫలితాలను సాధించి గ్రేటర్‌లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనపడిపోయి, అధికార బీఆర్‌ఎస్‌కు బీజేపీయే పోటీ అనే చర్చను తీసుకువచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఎన్నికల వరకు బండి సంజయ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారనే ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం అందుకు భిన్నమైన నిర్ణయంతో ముందుకు వచ్చింది. బండిని తప్పించి కిషన్‌ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది.

అధ్యక్ష మార్పు నేపథ్యంలో ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ శ్రేణులు ఆశించాయి. తాజాగా ఆయన్ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నట్లు పార్టీ ప్రకటన వెలువడటంతో, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇస్తారా లేదా అనే సందేహం మొదలైంది. రాష్ట్రాలకు అధ్యక్షులుగా పనిచేసిన వారికి మొదటి నుంచీ జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పిస్తోంది బీజేపీ. కానీ బండి సంజయ్‌ విషయంలో మరింత ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ వర్గాలు భావించాయి. కానీ, తాజా ప్రకటనతో అధిష్టానం, బండి సంజయ్‌ని కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం చేయాలనుకుంటోందా అనే సందేహం మొదలైంది.

Tags:    
Advertisement

Similar News