టార్గెట్ జీహెచ్ఎంసీ సెగ్మెంట్స్.. చేరికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్!

అంబర్‌పేట, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరుగురు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది.

Advertisement
Update:2023-09-14 07:28 IST

బీజేపీకి అర్బన్ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. అందుకే ఈ పార్టీ ఎక్కువగా జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన అర్బన్ నియోజకవర్గాలపై దృష్టి పెడుతూ ఉంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. 2018లో గెలిచిన గోషామహల్‌తో పాటు పార్టీకి పట్టు ఉన్న ముషీరాబాద్, అంబర్‌పేట, ఉప్పల్, సికింద్రాబాద్, కార్వాన్, నాంపల్లి సెగ్మెంట్లను గెలవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ వ్యూహాలకు అధికార బీఆర్ఎస్ అప్పుడే కౌంటర్ చేయడం మొదలు పెట్టింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. కానీ, ఆయన  అంబర్‌పేట నుంచి బరిలోకి దిగుతారని అంచనాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ కూడా అప్రమత్తం అయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 44 మంది కార్పొరేటర్లను గెలుచుకున్నది. ఇందులో అత్యధిక భాగం హైదరాబాద్ ఈస్ట్ వైపే ఉండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిస్తారు. అందుకే బీఆర్ఎస్ పలువురు బీజేపీ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

అంబర్‌పేట, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరుగురు బీజేపీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. ఇప్పటికే ఆయా కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అంబర్‌పేట నుంచి 2014 నుంచి 2018 మధ్యలో ప్రాతినిథ్యం వహించిన జి.కిషన్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో మరోసారి ఆయన తన లక్‌ను పరీక్షించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ కిషన్ రెడ్డి పోటీలో లేకుంటే వెంకట్‌రెడ్డి, గౌతమ్ రెడ్డి అక్కడి నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు.

కాగా, బీజేపీ గెలవకూడదనే లక్ష్యం పెట్టుకున్న బీఆర్ఎస్ ఆ సెగ్మెంట్‌లోని కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంబర్‌పేటకు చెందిన కార్పొరేటర్లు ఇప్పటికే బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని.. అధిష్టానం నుంచి ఓకే అయిన వెంటనే వారు గులాబీ కండువా కప్పుకుంటారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంటున్నారు.

ఉప్పల్ సీటుపై కూడా బీజేపీ కన్నేసింది. ఇక్కడి నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఈ సారి కూడా ఉప్పల్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రభాకర్ ఓటమి కోసం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. స్వయంగా బీజేపీ కార్పొరేటర్లే ఆయన కోసం పని చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. పార్టీ పరంగా తమకు ఎలాంటి ప్రయోజనం జరగడం లేదని విమర్శిస్తున్నారు. వీళ్లు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తున్నది.

ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన గెలుపు కోసం బీజేపీ కార్పొరేటర్లను తన వైపు తిప్పుకునే వ్యూహం సిద్ధం చేశారు. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు ప్రస్తుతం సుధీర్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.

ఇక బీజేపీ బలంగా ఉన్న ముషీరాబాద్, గోషామహల్ పరిధిలోని కీలకమైన బీజేపీ నాయకులను పార్టీలోకి తీసుకొని వచ్చేందుకు స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి బలం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లనే బీఆర్ఎస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తున్నది. అక్కడ ఓట్లు చీలకుండా పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే కీలకమైన స్థానాల్లోని బీజేపీ ముఖ్యనాయకులను బీఆర్ఎస్‌లో చేర్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆయా బీజేపీ నాయకుల చేరికకు మార్గ సుగమమం అవుతుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News