ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీశ్ ఆకస్మిక మృతి
నిరుడు ఏప్రిల్‌లో కూడా జగదీశ్‌కు ఛాతినొప్పి వచ్చింది. ఆ సమయంలో పక్కనే ఉన్న భార్య రమాదేవి సీపీఆర్ చేసి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకస్మికంగా మృతి చెందారు. హన్మకొండలోని స్నేహనగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఎంత సేపు అయినా ఆయన బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా.. ఆయన శరీరం నల్లగా మారిపోవడం గమనించారు. వెంటనే ములుగు రోడ్‌లో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఆయనలో ఎలాంటి కదలిక రాలేదు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో జగదీశ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
నిరుడు ఏప్రిల్‌లో కూడా జగదీశ్‌కు ఛాతినొప్పి వచ్చింది. ఆ సమయంలో పక్కనే ఉన్న భార్య రమాదేవి సీపీఆర్ చేసి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో జగదీశ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కానీ, ఈ సారి మాత్రం బాత్రూంలో పడిపోవడం.. సీపీఆర్ చేసేంత సమయం లేకపోవడంతో జగదీశ్ ప్రాణాలను కాపాడలేక పోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుసుమ జగదీశ్ కీలక నాయకుడిగా వ్యవహరించారు. అన్నీ తానై ముందుండి ఉద్యమంలో ఎంతో మందిని నడిపించారు. ఏఐపీఆర్ఎఫ్ సభ వరంగల్‌లో జరిగినప్పుడు.. కొంత మంది అగంతకులు వేదికను పేల్చేస్తామని బెదిరించారు. ఆ సమయంలో వేదిక మెట్లపై కూర్చొని ధైర్యంగా కాపలా కాసిన వ్యక్తిగా జగదీశ్‌ను గుర్తుంచుకుంటారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ములుగు పర్యటనలో జగదీశ్ అన్నీ తానై చూసుకున్నారు.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీశ్ అకాల మరణం పట్ల పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జగదీశ్ మరణం తనను కలిచి వేసిందని కేసీఆర్ చెప్పారు. జగదీశ్ మరణం తనను ఆవేదనకు గురి చేసింది.. శోకసంద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జగదీశ్ పోషింయిన చురుకైన పాత్ర మరువలేనిది. ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, జెడ్పీ చైర్మన్‌గా ఆయన అందించిన సేవలు మరువులేనివని కొనియాడారు. జగదీశ్ కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ పరంగా అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.