రేవంత్ రెడ్డి ఏడో గ్యారెంటీ..

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డుపై ఆమెకు ఉద్యోగం గ్యారెంటీ అని రాసి సంతకం పెట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ గ్యారెంటీతో రజిని సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement
Update:2023-10-18 09:28 IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ కార్డు ఇచ్చి, దానిపై నాయకులు సంతకాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆ గ్యారెంటీలన్నీ అమలులో పెడతామంటున్నారు. కేవలం హామీలు ఇచ్చి వదిలేయబోమని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని గ్యారెంటీగా చెబుతున్నారు నేతలు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి ఏడో గ్యారెంటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.

ఎవరా యువతి..?

ఆమె పేరు రజిని, దివ్యాంగురాలు. నాంపల్లికి చెందిన రజిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసినా కూడా ఆమెకి ఇంకా ఉద్యోగం రాలేదు. ప్రభుత్వ పోస్ట్ లకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కనీసం ప్రైవేటు ఉద్యోగం కూడా ఆమెకు దొరకలేదు. దివ్యాంగురాలు కావడంతో ప్రైవేటు రంగంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్లి తిరస్కరణకు గురయ్యానని చెబుతోంది రజిని. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలసి తనకు ఉద్యోగం కావాలంటూ అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను మన్నించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చారు.


ఇది నా గ్యారెంటీ..

కేవలం ఆమె అర్జీ తీసుకుని, హామీ ఇచ్చి పంపించలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డుపై ఆమెకు ఉద్యోగం గ్యారెంటీ అని రాసి సంతకం పెట్టారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే వస్తారని.. అదే రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇస్తుందని రజినీకి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ గ్యారెంటీతో రజిని సంతోషం వ్యక్తం చేసింది.

Tags:    
Advertisement

Similar News