నేను గొర్రెల మందలో లేను.. అందుకే రేవంత్ ఆఫర్ తిరస్కరించా

రేవంత్ రెడ్డి త‌న‌ను సుతిమెత్త‌గా పొగుడుతూనే అదేస్థాయిలో బెదిరిస్తున్నారని అన్నారు ప్రవీణ్ కుమార్. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ పదవికోసం తనను రేవంత్ రెడ్డి సంప్రదించిన మాట వాస్తవమే అని, అయితే తానే ఆ పదవిని వద్దన్నానని చెప్పారు.

Advertisement
Update:2024-03-18 18:56 IST

"రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే చాలా మంది పిరికిపంద‌లు, స్వార్థ‌ప‌రులు, అస‌మ‌ర్థులు వెళ్తారు. ఆ గొర్రెల మంద‌లో నేను ఒకడిని కాను. నిజంగా, నిఖార్సుగా, నిజాయితీగా ప‌ని చేసే వ్య‌క్తిని నేను. ప్యాకేజీకి కోసమే అయితే అధికార పార్టీలోకి వెళ్ళేవాడిని, తెలంగాణ పునర్నిర్మాణం కోసమే కేసీఆర్ తో కలుస్తున్నా." అని చెప్పారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఈరోజు కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు.


నన్ను బెదిరించాలనుకోవద్దు..

రేవంత్ రెడ్డి త‌న‌ను సుతిమెత్త‌గా పొగుడుతూనే అదేస్థాయిలో బెదిరిస్తున్నారని అన్నారు ప్రవీణ్ కుమార్. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ పదవికోసం తనను రేవంత్ రెడ్డి సంప్రదించిన మాట వాస్తవమే అని, అయితే తానే ఆ పదవిని వద్దన్నానని చెప్పారు. ప్ర‌జాక్షేత్రంలోనే ఉండాల‌నుకున్నాను కాబట్టే రేవంత్ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించానన్నారు ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్‌లోకి వెళ్తే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలంటూ తనను కొందరు బెదిరిస్తున్నారని.. ఏ వేదికపై పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి అనే స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. "సీఎం రేవంత్ రెడ్డి ద‌య‌చేసి బెదిరించడం మానుకోవాలి. నా లోప‌ల కూడా న‌డిగ‌డ్డ గాలే ఉంది. వార్నింగ్‌లు ఇచ్చి హోదాను త‌గ్గించుకోకండి" అని హితవు పలికారు ప్రవీణ్ కుమార్.

వాస్తవానికి బీఎస్పీ తరపున నాగర్ కర్నూలు అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకున్నారు. కానీ బీఎస్పీ దేశవ్యాప్తంగా ఎవరితోనూ పొత్తు పెట్టుకోవట్లేదని అధినేత మాయావతి ప్రకటించడం తదనంతర పరిణామాల వల్ల ఆయన ఏకంగా పార్టీని వీడాల్సి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News