పాదయాత్రలో రేవంత్ ఎన్నికల హామీలు..
ధరణి పోర్టల్ ను కూడా ఎత్తివేస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా అధికార బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కు పెడుతూనే ఎన్నికల హామీలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రేవంత్. రాష్ట్రంలో సమస్యలు తొలగిపోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ కి అంబేద్కర్ పేరు పెడతామన్నారు. ధరణి పోర్టల్ ను కూడా ఎత్తివేస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కారు 3 లక్షలు ఆర్థిక సాయంచేస్తోంది, దీన్ని 5 లక్షలకు పెంచుతామన్నారాయన.
మా ఎమ్మెల్యేల సంగతేంటి..?
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపైనా దర్యాప్తు చేయాలని కోరుతూ డీజీపీకి తాజాగా లేఖ రాశారు రేవంత్ రెడ్డి. జనవరి 6న మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాను ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. హైకోర్టులో కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్‌ఐఆర్ తో తన ఫిర్యాదును కూడా జత చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ వ్యవహారంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశాన్ని కూడా సీబీఐకి అప్పగించాలన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ..
రాష్ట్రంలో భూదందాలు జరుగుతున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. వాటన్నిటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలతో పాటు అధికార పార్టీ తనపై చేస్తున్న విమర్శలపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.