బరాబర్ 4వేలు ఇస్తాం.. రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆదాయం పెరిగిందని, పథకాల్ని ఎలా అమలు చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు రేవంత్ రెడ్డి. రూ.4000 పింఛన్ పై అనుమానాలుంటే.. చర్చ పెట్టాలని, తాము అవగాహన కల్పిస్తామని అన్నారు.
ఖమ్మం సభను విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే.. ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని తేల్చి చెప్పారు. 75 రూపాయలున్న పింఛన్ ను రూ.200 కి పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు రేవంత్ రెడ్డి. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4000 పింఛన్ ఇచ్చి తీరతామన్నారు.
తెలంగాణ ఆదాయం పెరిగిందని, పథకాల్ని ఎలా అమలు చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు రేవంత్ రెడ్డి. రూ.4000 పింఛన్ పై అనుమానాలుంటే.. చర్చ పెట్టాలని, తాము అవగాహన కల్పిస్తామని అన్నారు. బీజేపీ+బీఆర్ఎస్ = బైబై అంటూ సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు రేవంత్ రెడ్డి. ఖమ్మం సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. సభను అడ్డుకోవడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా సరఫరా చేయలేదన్నారు.
తెలంగాణలో పర్యటించడానికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎవరితో చర్చించడానికైనా తాను సిద్ధమేనన్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ సభతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిందని, తమ పార్టీలో ఎవరి మధ్యా ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అందరం కలసి కట్టుగా ఈ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.