ప్రశాంతంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష
తెలంగాణలో తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
తెలంగాణలో తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్ధలు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసులు పటిష్ఠ బందో బస్తు భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, పరిధిలో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,896 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 87.23% హాజరైనట్టు ఆర్డిఓ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. 563 పోస్టులు భర్తీ చేయనున్నారు. పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా గేట్లు తాళం వేయడంతో అక్కడే ఉన్న సిబ్బందిని అభ్యర్థులు చాలాసేపు వేడుకున్నారు. గేటు పట్టుకుని రోదిస్తూ దయచేసి పంపించాలని వేడుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని సిబ్బంది తెలిపారు.