చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు ,నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేర్లు పెడుదాం
శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన;
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దాన్ని పరిష్కరించడానికే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడుతున్నాం. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.
దివంగత మాజీ సీఎం రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉన్నది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తాను. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని కోరుతున్నాని సీఎం తెలిపారు.
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు
బల్కంపేటలో నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడుతాం. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్‌గా, సీఎంగా ఎన్నో సేవలు అందించారు. నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.