ప్రభుత్వ పెద్దల కోసమే ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు

వాళ్ల లాభం కోసం ప్రజలపై రూ.20 వేల కోట్ల అప్పుల భారం మోపబోతున్నరు : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2024-10-16 16:35 IST

ప్రభుత్వ పెద్దల లాభం కోసమే రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ మార్చుతున్నారని, తద్వారా ప్రజలపై రూ.20 వేల కోట్ల అప్పుల భారం మోపబోతున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం అలైన్‌మెంట్‌ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పూర్తయిందని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందన్నారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఫైనల్‌ చేయాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని, 182 కి.మీ.లతో వాళ్లు అలైన్‌మెంట్‌ ప్రతిపాదించారని తెలిపారు. ఆ అలైన్‌మెంట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ప్రముఖ భూములు ఉన్నాయని మార్పులు చేశారని చెప్పారు. అలైన్‌మెంట్‌ మార్పును నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఒప్పుకోదన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని.. అయినా మొండిగా మార్చడానికే సిద్ధపడిందన్నారు. అలైన్‌మెంట్‌ మార్పుతో దక్షిణ భాగం రీజినల్‌ రింగ్‌ రోడ్డు పొడవు 182 కి.మీ.ల నుంచి 198 కి.మీ.లకు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల అప్పులు తెచ్చి దక్షిణ భాగంలో రీజినల్‌ రోడ్డు నిర్మించడానికి సిద్ధమవుతోందన్నారు. తద్వారా కాంట్రాక్టర్ల జేబులు నింపి తాము లాభపడాలని చూస్తోందన్నారు. రుణమాఫీ పూర్తి చేయడానికి అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారని, రీజినల్‌ రింగ్‌ అలైన్‌మెంట్‌ మార్చి రూ.20 వేల కోట్ల అప్పులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం అలైన్‌మెంట్‌ 158 కి.మీ.ల కాగా, భూసేకరణ ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా అప్పట్లో ప్రతిపాదించారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉత్తరభాగంలో భూసేకరణ చేసి రైతులకు మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళలకు ఏటా రెండు చీరలు ఇస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. ఉన్న బతుకమ్మ చీరలు బంద్‌ పెట్టారన్నారు. రైతుబంధు రూ.10 వేలు కాదు, రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని, కేసీఆర్‌ కిట్‌ బంద్‌ పెట్టారని, చెరువుల్లో చేప పిల్లలు వేయడం కూడా బంద్‌ పెట్టారని తెలిపారు. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజల జీవితాల్లో మార్పులు తేకపోగా ఉన్న పథకాలనే ఊడగొట్టిందన్నారు. ఉచితంగా చేపపిల్లలు ఇవ్వకుండా ముదిరాజ్‌, గంగపుత్రలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఆగస్టులో చెరువుల్లో చేప పిల్లలు పోయాల్సి ఉండగా, అక్టోబర్‌ వచ్చినా ఆ పని చేయలేదన్నారు. చేప పిల్లల పంపిణీ కోసం తమ ప్రభుత్వం రూ.వంద కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ లోనే రూ.16 కోట్లు కేటాయించిందన్నారు. తద్వారా ఈ పథకాన్నే పూర్తిగా ఎత్తివేసిందని తెలిపారు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ లో రూ.5 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారని, ఆరు నెలలైనా పైసా ఇవ్వలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News