అమిత్ షా, చంద్రబాబు.. మధ్యలో రామోజీ..

ఫిలిం సిటీలో చంద్రబాబు, అమిత్ షా కోసం వేచి చూస్తుంటారని, అక్కడ బాబు, రామోజీరావుతో కలసి ఆయన కీలక చర్చలు జరుపుతారని అంటున్నారు. ఈ కీలక భేటీ వ్యవహారాలను సుజనా చౌదరి పర్యవేక్షిస్తున్నారనేది సారాంశం.

Advertisement
Update:2022-08-20 13:43 IST

రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పడంతోపాటు మునుగోడు ప్రచార భేరిని ప్రారంభించేందుకు ఈనెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. మునుగోడు సభలో పాల్గొన్న అనంతరం నేరుగా హైదరాబాద్ వచ్చి నోవాటెల్ హోటల్ లో రాష్ట్ర బీజేపీ నేతలను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. కానీ సడన్ గా షెడ్యూల్ మారింది. మధ్యలో 45 నిముషాలపాటు ఆయన రామోజీ ఫిలిం సిటీలో బసచేయబోతున్నారు. మునుగోడు టు హైదరాబాద్.. మధ్యలో ఈ ఫిలిం సిటీ వ్యవహారమేంటి అనే చర్చ మొదలైంది. ఫిలిం సిటీలో చంద్రబాబు, అమిత్ షా కోసం వేచి చూస్తుంటారని, అక్కడ బాబు, రామోజీరావుతో కలసి ఆయన కీలక చర్చలు జరుపుతారని అంటున్నారు. ఈ కీలక భేటీ వ్యవహారాలను సుజనా చౌదరి పర్యవేక్షిస్తున్నారనేది సారాంశం.

పొత్తుకోసం పాకులాట..

ఏపీలో వైసీపీని ఎదుర్కోడానికి బాబుకి ధైర్యం చాలడంలేదు. జనసేన, బీజేపీ కలిస్తేనే జగన్ ని ఎదుర్కోగలం అనే ఆలోచనలో ఉన్నారు బాబు. ఇటు తెలంగాణలో బీజేపీకి కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యవసరంగా మారాయి. తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో కమ్మ ఓటుబ్యాంక్ కీలకంగా ఉందని బీజేపీ అంచనా. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు వల్ల రెండు పార్టీలు లాభపడ్డాయి. టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు, బీజేపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. 2018లో ఇరుపార్టీలు వేరుపడ్డాయి. కాంగ్రెస్ తో కలసి టీడీపీ బావుకుందేమీ లేదు. కేవలం రెండు సీట్లకే పరిమితమైంది, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఇక బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు సాధించింది. ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు అదనంగా గెలుచుకుని, మూడో ఉప ఎన్నికకోసం ఎదురు చూస్తోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఓట్లకోసం బీజేపీ ఎదురు చూస్తోంది, 2024లో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఓ భేటీ అత్యవసరం అయింది.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో విభేదించిన చంద్రబాబు, మోదీని చెడామడా తిట్టేశారు. ఏపీలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీపై నెట్టేసి 2019 ఎన్నికల్లో లాభపడాలని చూశారు. కానీ అస్సలు కుదర్లేదు. దీంతో జ్ఞానోదయం అయింది, కానీ బీజేపీ దగ్గరకు రానీయడంలేదు. ఎలాగోలా పులిహోర కలిపేందుకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిచ్చి సాగిలపడ్డారు. దీంతో బీజేపీ ఆయనపై కాస్త కరుణ చూపినట్టు అర్థమవుతోంది. అందులోనూ వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుని వాడుకోవాలన్నది బీజేపీ ఆలోచన. దీనికోసం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో అమిత్ షా - చంద్రబాబు భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. వేదిక రామోజీ ఫిలింసిటీ కావడంతో ఇది మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తమ్మీద మునుగోడు ఉప ఎన్నిక వేళ.. బీజేపీ, టీడీపీ మధ్య స్నేహం చిగురించే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఈ పాతమిత్రుల కొత్త కలయిక వల్ల ఎవరికీ పెద్దగా ఒరిగేదేమీ లేదని విశ్లేషకుల వాదన.

Tags:    
Advertisement

Similar News