గోషా మహల్ టికెట్ కి రాహుల్ దరఖాస్తు..

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో గోషా మహల్ లేదు. అంటే ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ కూడా తర్జన భర్జన పడుతోంది. ఈ దశలో రాహుల్ సిప్లిగంజ్ వంటి పేరున్న గాయకుడు, పక్కా లోకల్ యువకుడిని బరిలో దింపాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2023-08-25 22:46 IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అసెంబ్లీ టికెట్లకోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గతంలో అంతా లాబీయింగ్ ద్వారానే జరిగేది, చివరకు అధిష్టానం నిర్ణయించేది. ఇప్పుడు ఎవరెవరు ఏయే స్థానాలపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయం దాదాపుగా ముందుగానే తెలిసిపోతోంది. నాటు నాటుతో ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ తరపున గోషామహల్ స్థానానికి పోటీ పడాలని ఆశిస్తున్నారు. ఆయన గోషా మహల్ సీటుకోసం దరఖాస్తు చేసుకున్నారు.

యూట్యూబర్ గా లోకల్ సాంగ్స్ తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, తర్వాత సినీ గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యారు. ఆ తర్వాత నాటు నాటుతో ఆస్కార్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకెళ్తున్న రాహుల్ సడన్ గా రాజకీయాలవైపు దృష్టి సారించడం విశేషమే. అందులోనూ కాంగ్రెస్ నుంచి ఆయన పోటీపడాలని ఉత్సాహపడటం మరో విశేషం.

బరిలో దిగారా..? దింపారా..?

వాస్తవానికి రాహుల్ సిప్లిగంజ్ కి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఆస్కార్ పర్ఫామెన్స్ తర్వాత తెలంగాణ వచ్చిన రాహుల్ కి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో రాహుల్ కి సన్మాన సభ ఏర్పాటు చేసి పొగడ్తల్లో ముంచెత్తారు. 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే 5 కోట్ల రూపాయలతో పాటు సిటీలో ఇంటి స్థలం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. పనిలో పనిగా రాహుల్ కి అప్పుడే రేవంత్ రెడ్డి గోషా మహల్ సీటు ఆఫర్ చేశారని గుసగుసలు వినిపించాయి. అవి ఇప్పుడు నిజమని తేలిపోయాయి. రాహుల్, గోషా మహల్ కు దరఖాస్తు చేయడంతో వ్యూహాత్మకంగా రేవంత్ అతడిని బరిలో దింపుతున్నారని అంటున్నారు పార్టీ నాయకులు.

2018 ఎన్నికల్లో గోషా మహల్ లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ నేత రాజాసింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే దఫా ముకేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కి ఆ టికెట్ ఇవ్వాలనుకుంటోంది బీజేపీ. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో గోషా మహల్ లేదు. అంటే ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ కూడా తర్జన భర్జన పడుతోంది. ఈ దశలో రాహుల్ సిప్లిగంజ్ వంటి పేరున్న గాయకుడు, పక్కా లోకల్ యువకుడిని బరిలో దింపాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News