రాహుల్ తెలంగాణ పర్యటన రద్దు..! కారణం అదేనా..?
మొదటి విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా జులైలో వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత అనుకోకుండా అది ఆగస్ట్ 15కి వాయిదా పడింది. చివరకు ఆగస్ట్ 24 అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేదని తేలిపోయింది.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దైనట్టు తెలుస్తోంది. ఈనెల 24న రుణమాఫీ కృతజ్ఞత సభలో పాల్గొనడానికి ఆయన తెలంగాణ వస్తున్నారని పార్టీ వర్గాలు ఇటీవల ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడా పర్యటన రద్దయినట్టు చెబుతున్నారు. రాహుల్ తెలంగాణకు రావట్లేదనే విషయంలో క్లారిటీ వచ్చినా ఆయన పర్యటన ఎందుకు రద్దయిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
మొదటి విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా జులైలో వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ రాకను ధృవీకరించారు. ఆ తర్వాత అనుకోకుండా అది ఆగస్ట్ 15కి వాయిదా పడింది. చివరకు ఆగస్ట్ 24 అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేదని తేలిపోయింది. రాహుల్ తెలంగాణ పర్యటనకు రావట్లేదని పార్టీ వర్గాల సమాచారం.
ఎందుకు..?
రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులు గుర్రుగా ఉన్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన అన్నదాతలకు మరో అవకాశమిస్తామన్నాారు. ఈలోగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు, సీఎం దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఇంత గందరగోళం మధ్య రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ అంటే అది మరీ అతిగా ఉంటుందని కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఆయన సభ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది. ఇలాంటి సమయంలో రాహుల్ పర్యటనకు వస్తే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఆయన వెనకడుగు వేశారని అంటున్నారు.