కుల గణనను రాహుల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరు
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా అందుకే రాష్ట్రానికి వస్తున్నరు : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కుల గణను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం కుల గణనపై ఇందిరా భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కుల గణనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల బిజీగా కారణంగా రాహుల్ గాంధీ గంట సేపు మాత్రమే హైదరాబాద్ లో ఉంటారని చెప్పారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకుంటారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో కుల గణన చేపట్టి ఆయా వర్గాల జనాభా ఆధారంగా సంపద పంపిణీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. దశాబ్దాల తర్వాత చేపడుతోన్న కుల గణనతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల నుంచి సమాచార సేకరణ కోసం అనేక ప్రశ్నలు పొందు పరిచామని, ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే సర్వే సమగ్రంగా ఉంటుందో అన్నివర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు కుల గణను సహకరించాలని కోరారు.