ఓటర్లకు భారీగా డబ్బు పంపిణీ.. ఈసీ, పోలీసులకు దొరకుండా నయా ప్లాన్

క్యాష్ ట్రాన్స్‌ఫర్ల గురించి తెలుసుకున్న ఈసీ అప్రమత్తం అయ్యింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు అధికారులకు లేఖలు రాసింది.

Advertisement
Update:2022-10-12 09:05 IST

మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవైపు ఊరూరా ప్రచారం చూసుకుంటూనే మరో వైపు ఓటర్లకు తాయిలాల ఆశ చూపిస్తున్నాయి. మందు, మటన్, క్యాష్, బంగారం.. వాట్ నాట్.. అన్ని రకాల ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. 19 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమ నగదు తరలించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఎలాంటి నగదు పట్టుబడక పోవడం గమనార్హం. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. ముఖ్యంగా ఉపఎన్నిక అయితే మరింత డబ్బు చేతులు మారుతుంది. కానీ మునుగోడులో ఇంత వరకు భారీగా డబ్బు ఎక్కడా పట్టుబడలేదు.

మునుగోడులోకి భారీగ నగదు రాకపోయినా.. ఓటర్లకు మాత్రం దండిగానే ముడుతున్నట్లు తెలుస్తున్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఓటర్లకు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ చేస్తున్నట్లు గుర్తించారు. ఫోన్ పే, జీపే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ఉపయోగించి ఆయా ఓటర్ల అకౌంట్లలో జమ చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎలాగైతే డీబీటీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయో.. ఇప్పుడు ఓటర్లకు పార్టీలు కూడా అదే విధంగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో పాటు లిక్కర్, మటన్, చికెన్ కొనుగోళ్లకు సెపరేట్‌గా డబ్బులు ఇస్తున్నారని.. కొంత మంది నాయకులు రా మటన్ ప్యాకెట్లు ఇంటికే పంపుతున్నట్లు తెలుస్తున్నది.

రాజకీయా పార్టీలు అన్నీ మునుగోడు ఓటర్ల ఫోన్ నెంబర్ల క్షేత్రస్థాయి కార్యకర్తల ద్వారా ఇప్పటికే సంపాదించి పెట్టుకున్నాయి. ఒకే అకౌంట్ నుంచి పంపకుండా.. వేర్వేరు అకౌంట్ల ద్వారా ఓటర్లకు నగదు బదిలీ చేస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల బ్యాంకు ఖాతాల నుంచి వేర్వేరు ఫోన్ నెంబర్లకు ఈ మనీ ట్రాన్స్‌ఫర్ జరుగుతోంది. ముందుగా జిల్లా హెడ్ నుంచి నియోజకవర్గాల ఇంచార్జులకు.. అక్కడి నుంచి మండల స్థాయి నాయకులకు.. వాళ్ల దగ్గర నుంచి గ్రామ ఇంచార్జులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఇలా క్యాష్ ట్రాన్స్‌ఫర్ అవుతుండటం వల్లే తనిఖీలు జరిగినా నగదు దొరకడం లేదని తెలుస్తున్నది.

క్యాష్ ట్రాన్స్‌ఫర్ల గురించి తెలుసుకున్న ఈసీ అప్రమత్తం అయ్యింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు అధికారులకు లేఖలు రాసింది. ఎవరైనా ఈ 20 రోజుల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన ట్రాన్స్‌శాక్షన్స్ చేస్తే వెంటనే తెలియజేయాలని కోరింది. గతంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయని అకౌంట్లలో భారీగా నగదు జమ అయినా తెలపాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News